తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథ్ సంచలన్ కు గ్రీన్ సిగ్నల్

తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథ్ సంచలన్ కు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్ఎస్‌) తమిళనాడులో వివిధ నగరాలలో రహదారులపై చేపట్టదలచిన పథ్ సంచలన్ (ర్యాలీ)కి ఎట్టకేలకు మద్రాస్ హైకోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిబంధనలతో పోలీసులు ర్యాలీకి అనుమతివ్వాలని ఆదేశించింది.

కోయంబత్తూరు ప్రాంతంలో బాంబు పేలుడు వంటి హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాద సంస్థల అనుచరుల అరెస్టు తదితర ఘటనల నేపథ్యంలో గత యేడాది అక్టోబర్‌ 2న ర్యాలీ నిర్వహించేందుకు ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధమైంది. అయితే పోలీసుశాఖ దానికి అనుమతి నిరాకరించింది. దీనిపై ఆర్‌ఎస్ఎస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

 ఆ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి భారీ క్రీడా మైదానాల్లో నాలుగువైపులా ఎత్తయిన ప్రహరీ కలిగిన ప్రాంతంలో ర్యాలీ జరిపేందుకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆర్‌ఎ్‌సఎస్‌ తరఫున హైకోర్టులో 45 అప్పీలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు మహాదేవన్‌, మహమ్మద్‌ సఫీక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్‌ఎ్‌సఎస్‌ తరఫున హాజరైన న్యాయవాదులు రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం శాంతియుతంగా జరిపే ర్యాలీకి అనుమతివ్వడం లేదని తెలిపారు.

ఇరుపక్షాల వాదప్రతివాదనల అనంతరం ధర్మాసనం శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ ర్యాలీకి అనుమతించాలని పోలీస్‏శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

పోలీసులు ర్యాలీలు, ప్రదర్శనలకు అమలు చేస్తున్న కఠిన నిబంధనలను అమలుచేసి ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతివ్వాలని ఆదేశించింది. ఆర్‌ఎస్ఎస్‌ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించేందుకు మూడు తేదీలను పోలీసులకు ప్రతిపాదించాలని, వాటిలో ఒక దానిని పోలీసులు ఖరారు చేసి, తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది.