ఒకవేళ తమ సార్వభౌమత్వానికి చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దానికి తగినట్లే వ్యవహరించామని పేర్కొంటూ గత శనివారం చైనా నిఘా బెలూన్ను పేల్చివేసిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో పరోక్షంగా ఆయన ప్రస్తావించారు.
ఒక విషయంలో అందరూ స్పష్టంగా ఉండాలని, చైనాతో జరుగుతున్న వ్యాపార పోరాటంలో గెలుపు అనేది అందర్నీ కలపాలని, ప్రపంచవ్యాప్తంగా తమ దేశానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచాయ్వాప్తంగా గత రెండేళ్లలో ప్రజాస్వామ్యాలు బలపడ్డాయని, కానీ బలహీనపడలేదని బైడెన్ తెలిపారు.
అమెరికా ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్‌లో బైడెన్ ప్రసంగించడం ఇది రెండోసారి. ఈసారి ఆయన ఉభయసభలను ఉద్దేశించి గంటా 15 నిమిషాలు మాట్లాడారు. బైడెన్ ప్రసంగాన్ని రిపబ్లికన్లు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఉండగా, అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ను శనివారం పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ నిఘా బెలూన్ శకలాలను యూఎస్ నేవీ సేకరించింది. దానికి సంబంధించిన ఫోటోలను అమెరికా నౌకాదళం విడుదల చేసింది. బోటులోకి భారీ స్థాయిలో బెలూన్ శిథిలాలను ఎక్కిస్తున్న ఫోటోలను యూఎస్ ఫ్లీట్ ఫోర్సెస్ కమాండ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది.సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్ వద్ద ఆ శకలాలను సేకరించారు చైనా బెలూన్‌లో ఎటువంటి నిఘా ఎక్విప్మెంట్ ఉందో ఆ శిథిలాల ఆధారంగా అమెరికా నిపుణులు అంచనా వేయనున్నారు.
బెలూన్ దాదాపు 60 మీటర్ల ఎత్తులో ఎగిరిందని, దాంట్లో ఓ విమానంలో ఉన్నంత పేలోడ్ ఉందని, ఇక అది వేల పౌండ్ల బరువు ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రజల ప్రయోజనార్ధం ఆ బెలూన్ను విడుదల చేశామని, కానీ అది అనుకోకుండా అమెరికా వైపు వెళ్లినట్లు చైనా చెబుతోంది.
అమెరికా గగనతలంలో బెలూన్ కనిపించిన తర్వాత.. ఆ దేశానికి చైనాకు మధ్య దౌత్యపరమైన వివాదాలు తలెత్తాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉత్తర అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీంతో చైనా నిఘా బెలూన్ను అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు దేశ తూర్పుతీరంలో కూల్చివేసినట్లు పెంటగాన్ ప్రకటించింది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?