కేజ్రీవాల్ రాజీనామాకై బీజేపీ భారీ నిరసనలు

కేజ్రీవాల్ రాజీనామాకై బీజేపీ భారీ నిరసనలు
లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) గురువారం చార్జిషీట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలోని బిజెపి కార్యకర్తలు ఆప్‌ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం భారీ నిరసన చేపట్టారు.
 
బీజేపీ కార్యకర్తలు ఆప్  ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ ‘చోర్‌ చోర్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్యం విక్రయాల విధానంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడ్డారని తక్షణమే తన సిఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.
 
కేజ్రీవాల్ అవినీతిని బహిర్గతం చేస్తూ బిజెపి ఆందోళనలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా స్పష్టం చేశారు.  ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేజ్రీవాల్ పర్యవేక్షణలో జరిగిన్నట్లు బిజెపి మొదటినుండి అంటూనే ఉన్నదని ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రంవీర్ సింగ్ బిందూరి గుర్తు చేశారు. ఇప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ తో ఈ విషయమై వెల్లడైనదని తెలిపారు.
 
కొంతమంది నిరసనకారులు ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనల్లో పాల్గొన్నారు.  ఈ నిరసనల్లో బిజెపి కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో.. పోలీసులు బారికేడ్లను అడ్డుగా పెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు.
 
కాగా, ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని.. ఐదుగురు వ్యక్తులు, ఏడు కంపెనీలపై గురువారం ఇడి ఛార్జిషీటు నమోదు చేసింది. లిక్కర్‌స్కాంలో సంపాదించిన రూ. 100 కోట్లను గతేడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్‌ పార్టీ ఉపయోగించిందని ఇడి ఆరోపించింది. ఈ కుభకోణంలో ఆమ్‌ఆద్మీపార్టీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జి విజరు నాయర్‌, సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్యం యజమానితో వీడియో కాల్‌ మాట్లాడరని ఇడి పేర్కొంది.