ఒడిశా మంత్రిపై ఓ పోలీసు కాల్పులు.. పరిస్థితి విషమం

ఒడిశా మంత్రిపై ఓ పోలీసు కాల్పులు.. పరిస్థితి విషమం
ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి, బిజూ జనతా దళ్ సీనియర్ నేత నబా కిశోర్ దాస్‍పై ఓ పోలీసు కాల్పులు జరిపాడు. ఆదివారం జార్సుగూడ జిల్లా బ్రజరాజ్ నగర్‌లోని గాంధీ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ అసిస్టెంట్ సబ్‍ఇన్‍స్పెక్టర్.. మంత్రి కిశోర్ దాస్ ఛాతిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.  ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రిని తుపాకీతో కాల్చాడు.
మంత్రికి బుల్లెట్ గాయాలయ్యాయి. మంత్రి ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అక్కడి అధికారులు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానం ద్వారా భువనేశ్వర్‌కు తరలించారు.

“అసిస్టెంట్ సబ్‍ఇన్‍స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాల్ దాస్… మంత్రిపై కాల్పులు జరిపాడు. మంత్రి గాయాలపాలయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించాం” అని బ్రజ్‍రాజ్‍నగర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గుప్తేశ్వర్ వెల్లడించారు. ఏఎస్ఐ గోపాల్ దాస్‍ను ఇక్కడి వారు పట్టుకున్నారు. పోలీసులు అతడిని కస్టడీకి తరలించారు.

వాహనం దిగగానే మంత్రిపై ఆ ఏఎస్ఐ కాల్పులు జరిపారని కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే అతడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారన్న కారణాలు ఇంకా బయటికి రాలేదు. ప్రజా ఫిర్యాదుల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి నబా కిశోర్ దాస బ్రజ్‍రాజ్‍నగర్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారు దిగుతుండగానే ఆ ఏఎస్ఐ ఆయనపై కాల్పులు జరిపాడు. ఛాతి నుంచి రక్తం కారుతున్న మంత్రిని అక్కడి వారు ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోలు కూడా బయటికి వచ్చాయి. ఆ సమయంలో మంత్రి అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.

మంత్రి నబా కిశోర్ దాస్‍పై జరిగిన దాడిని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో పూర్తి విచారణ చేయాలని క్రైమ్ బ్రాంచ్‍కు ఆదేశాలు జారీ చేశారు. “ఈ దురదృష్టకర దాడి ఘటనపై నేను షాక్ అయ్యా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. దర్యాప్తు చేపట్టాలని క్రైమ్ బ్రాంచ్‍ను ఆదేశిస్తున్నా. క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్లు.. సంఘటనా స్థలానికి వెళ్లాలి” అని సీఎం పట్నాయక్ ఆదేశించారు.

ఈ ఘటనతో మంత్రి నబా కిశోర్ దాస్ మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. బ్రజ్‍రాజ్‍నగర్ సిటీ మొత్తం ఉద్రిక్తంగా మారింది. మంత్రిని లక్ష్యంగా చేసుకొని కుట్రలు జరుగుతున్నాయని కొందరు ఆరోపణలు చేశారు. బీజేడీ సీనియర్‌ నేత అయిన నబ కిశోర్‌ దాస్‌.. ఇటీవల మహారాష్ట్రలోని శని శింగణాపుర్‌ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు. కాగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మంత్రిపై దాడి జరగడం పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యింది.