తాలిబన్ల ఏలుబడిలో మహిళలకు అనేక ఆంక్షలు, నిరంకుశ పరిమితులు విధించడం ఆఫ్గనిస్తాన్ లో తీస్తున్నారు. వారి అరాచకాలు ఏవిధంగా శృతిమించుతున్నాయంటే మహిళలు మాత్రమే కాదు ఆడబొమ్మలు సహితం ముసుగులు లేకుండా కనిపించరాదని స్పష్టం చేస్తున్నారు. ఆడ బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని తాలిబన్లు తేల్చి చెబుతున్నారు.
దేశ రాజధాని కాబూల్ లోని ఓ బట్టల దుకాణంలో బట్టల ప్రదర్శన కోసం పెట్టిన బొమ్మల ముఖాలకు ముసుగు కనిపిస్తోంది. మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదని, బురఖా తప్పనిసరిగా ధరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది అఫ్ఘాన్ ప్రభుత్వం. యూనివర్సిటీలలో స్త్రీలకు ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. జిమ్ లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులలోకి కూడా మహిళలను అనుమతించట్లేదు.
వీటితో పాటు మహిళలపై చాలా ఆంక్షలు విధించింది. ఇప్పుడు దుకాణాలలో ప్రదర్శనకు పెట్టే మహిళల బొమ్మలకూ ముసుగు ఉండాల్సిందేననడం గమనార్హం. ఈ మేరకు బొమ్మల ముఖాలు కనిపించకుండా ముసుగు వెయ్యాలని తాలిబన్లు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు.
గత్యంతరం లేక బొమ్మల ముఖాలకు ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగ్ లను కప్పుతున్నట్లు వివరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడే కాస్త నయమని మరికొందరు చెబుతున్నారు. తాలిబన్లు గతంలో పాలించినప్పుడు దుకాణాలలో మహిళల బొమ్మలు ఉంచేందుకు ఒప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఆ బొమ్మలకు తల లేకుండా చూడాలని ఆదేశించేవారని దుకాణదారులు వెల్లడించారు. రాను రాను తాలిబన్ల పాలనలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆడ బొమ్మలపై కూడా వారి పెత్తనం కొనసాగుతుందంటే ఇంకేమని చెప్పాలి.

More Stories
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
రూ.500తో మహిళలకు 40 నిమిషాల ఆన్లైన్ ఉగ్రవాద శిక్షణ