
ఐరోపాలో అనుసరించే మార్గదర్శకాలను భారత్‌లో ఎందుకు పాటించడం లేదని మంగళవారం సుప్రీంకోర్టు గూగుల్‌ను ప్రశ్నించింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఉచితంగా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు ఐరోపాలో పాటించే మార్గదర్శకాలను భారత్‌లోనూ పాటిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి. పార్థివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.
దీనిపై ప్రతిస్పందనను తదుపరి విచారణలో తెలపాలని గూగుల్‌ను ఆదేశించింది. ఎన్‌సిఎల్‌ఎటి నిర్ణయంపై ధర్మాసనం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అన్యాయమైన, పోటీకి విరుద్ధమైన పద్ధతులను అవలంబిస్తున్న గూగుల్ సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఈ ఆదేశాలపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో గూగుల్ సుప్రీంకోర్టను ఆశ్రయించింది. 2016లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో యాప్‌లను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసే గూగుల్ చర్య అన్యాయమని ఇయు కమిషన్ గుర్తించిందని, అనంతరం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో సూచించిందని సిసిఐ సుప్రీంకోర్టుకి తెలిపింది.
అయితే భారత్‌లో మాత్రం మునుపటి మార్గదర్శకాలను కొనసాగిస్తోందని, కమిషన్ సూచించిన ఆదేశాలకు కట్టుబడేందుకు సుముఖత చూపలేదని సిసిఐ పేర్కొంది. సిసిఐ విధించిన జరిమానాపై జనవరి 6న ఎన్‌సిఎల్‌ఎటి స్టే ఇచ్చేందుకు నిరాకరిచండంతో పాటు మొత్తం జరిమానాలో పది శాతాన్ని మూడు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
More Stories
మరో 114 రఫేల్ విమానాలు… హైదరాబాద్‌లో ఓవర్‌హాల్ ఫెసిలిటీ!
భారత్, చాలాపై భారీ టారిఫ్‌లకు జీ7 దేశాల అంగీకారం!
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు