తెలంగాణలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు

తెలంగాణలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు

తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది. టిడిపితో పొత్తు గురించి ఆలోచిస్తున్నామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ పేర్కొన్నట్లు కొన్ని మీడియా కధనాలు వెలువడటంతో శుక్రవారం కొంత గందరగోళం ఏర్పడింది. అయితే అటువంటి ఆలోచనలు ఏవీ లేవని పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి తేల్చి చెప్పారు.

పైగా,  బీజేపీ, టీడీపీ పొత్తులపై తరుణ్ ఛుగ్ సహితం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఆర్ఎస్ ను ఇంటికి పంపేందుకు, బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు 12 లోక్‌సభ స్థానాలను గెల్చుకోవడం కోసం బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు చేరికలను వేగవంతం చేయాలని అధిష్ఠానం భావిస్తోందని ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రస్తుతం దృష్టి సారించామని, ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 11 వేల సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. 9 వేల శక్తి కేంద్రాలతోపాటు మరో మూడు వేల ప్రాంతాల్లో ఈ సభలు ఉంటాయని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే సభలకు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెలాఖరులో  ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సహితం రాష్ట్రంలో పర్యటింపనున్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి సమాలోచనలు చేస్తున్నట్టుగా వచ్చిన కథనాలను తరుణ్ చుగ్ ఖండించారు. పార్టీకి దురుద్దేశాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనాలు సృష్టించారని పేర్కొంటూ చుగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆయన సంక్రాంతి సందర్భంగా మీడియా ప్రతినిధులకు అల్పాహార విందు ఢిల్లీలో ఏర్పాటు చేయగా, ఈ సందర్భంగా పిచ్చాపాటిగా రాజకీయాల గురించి మాట్లాడిన్నల్టు చెప్పారు.

అయితే, ఇందులో తెలుగుదేశంతో పొత్తుల గురించి ఆలోచిస్తామని, షర్మిలకు మద్ధతివ్వడం గురించి పరోక్షంగా కూడా తాను ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ తమతో పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను ఒంటరిగా ఓడించేంత బలం బీజేపీకి ఉందని, రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని ఆయన తేల్చి చెప్పారు.

28న రాష్ట్రానికి అమిత్ షా రాక

ఇలా ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న అంశంపైనా ఆయన సమీక్ష చేసి  సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

అమిత్ షా రాక నేపథ్యంలో కనీసం రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమాలు జరిగే విధంగా  చూస్తున్నారు. రెండో రోజు పర్యటనలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జీలు, మండల పార్టీ అధ్యక్షులతో బృందాల  వారీగా అమిత్ షాతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చెయ్యడంపైనా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో మాదిరిగానే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్ లుగా విభజించి.. ఆ క్లస్టర్ ల వారీగానే పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయడం ద్వారా ఇటు ఎంపీ సీట్లు, అటు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా గెలుచుకునే చాన్స్ ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలోనూ అమిత్ షా పర్యటన తర్వాత స్పష్టత రానుందని చెప్తున్నారు.