బ్రెజిల్ లో అధ్యక్ష భవనం,సుప్రీంకోర్టుల ముట్టడింపు

బ్రెజిల్ లో అధ్యక్ష భవనం,సుప్రీంకోర్టుల ముట్టడింపు
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సెనారో మద్దతుదారులు ఆదివారం రాజధాని బ్రసీలియాలోని అధ్యక్షభవనం, కాంగ్రెస్‌, సుప్రీంకోర్టులను ముట్టడించారు.  బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్లా ప్రమాణస్వీకారం జరిగిన వారం రోజుల తర్వాత ఈ ముట్టడి జరిగింది.  నేషనల్  కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు భవనాల కిటికీలు, ఫర్నీచర్‌ సహా విలువైన సామగ్రిని  ధ్వంసం చేశారు.
బోల్సెనారో   ఓటమిని అంగీకరించడానికి వారు నిరాకరిస్తూ మూడుగంటలకు పైగా కొనసాగిన ముట్టడిలో విధ్వంసానికి పాల్పడ్డారు.  సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడంగానీ లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.
కాంగ్రెస్‌ భవనం పైకప్పుపైకి ఎక్కడంతో పాటు బ్రెజిల్‌ సెనెట్‌, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే కాంగ్రెస్‌ భవనంపై కప్పుపైకి ఎక్కి  బ్యానర్లు ప్రదర్శించారు. బ్రెజిలియన్‌ జెండాలు ధరించిన బోల్సెనారో మద్దతుదారులు అధ్యక్షభవనంలో తిరుగుతున్నట్లు టివి ఛానల్‌ గ్లోబో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
మద్దతుదారులు ఒక పోలీసుపై దాడి చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లను దిగ్బంధించడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. సైనిక భవనాల వెలుపల ఆందోళన చేపడుతూ భద్రతా దళాలు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో సుమారు 3,000 మంది పాల్గొన్నట్లు  స్థానిక మీడియా అంచనా వేసింది.  ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించాయి.
ఈ ముట్టడిని లూలా ఖండించారు. ఫాసిస్టులు, మతోన్మాదులు రాజకీయ కక్షతో రాజధానిలో విధ్వంసం సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా దళాలు ఈ అల్లర్లను  అణచివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ‘వారు చేసిన పని వర్ణించలేము.. దోషులు శిక్ష అనుభవించాల్సిందే’ అని  సాస్పష్టం చేశారు.
 బోల్సెనారో మద్దతుదారుల అరాచక దాడిలో దెబ్బతిన్న ప్రాంతాల్లో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా సోమవారం పర్యటించారు. బోల్సెనారో తన చర్యలతో ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 గతేడాది అక్టోబర్‌ 30న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని బల్సెనారో ఈ నిరసనలకు ఆజ్యం పోశారు.
బ్రసిలియా లో ప్రభుత్వ సంబంధి సంస్థల కు వ్యతిరేకం గా దొమ్మీలు , విధ్వంస ఘటన లు జరిగినట్టు వచ్చిన వార్తను గురించి తెలుసుకొని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ తన ఆందోళన ను వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక సంప్రదాయాలను అందరూ గౌరవించి తీరాలని స్పష్టం చేశారు. బ్రెజిలియన్ అధికారులకు పూర్తి సమర్థనను ప్రకటించారు.
 బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో బోల్సెనారో మద్దతుదారుల అరాచకాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యంపై  దాడిని లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల నేతలు ఖండించారు. ప్రస్తుత అధ్యక్షుడు లూలా డ సిల్వా విజయాన్ని అంగీకరించని బోల్సెనారో వర్గం హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని  మండిపడ్డారు.