జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ 

జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ 
కేవలం నిరసనకారులపైననే కాకుండా దేశంలో నిరసనలకు మద్దతిచ్చిన జర్నలిస్టులు, ఇతరులపై కూడా ఇరాన్‌ పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం తమలో ఎవరినైనా అరెస్ట్‌ చేయవచ్చని ఇరాన్‌ జర్నలిస్టులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితిని సోషల్‌మీడియా ద్వారా జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేయడానికి యత్నించడం అక్కడి పాలకులకు  ఆగ్రహం కలిగిస్తోంది.
దీంతో దేశంలో నిరసనలకు మద్దతు ఇచ్చే వారిని ఇరాన్‌ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని,  జర్నలిస్టులను అరెస్ట్‌ చేయడం, వారి వ్యాసాలను మీడియా నుండి తొలగించడమే కాకుండా, హక్కుల ఉల్లంఘనలను ప్రపంచానికి వెల్లడించిన నిపుణులపై కూడా అణచివేత కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
”2023 జనవరి 1న జర్నలిస్టు మిలాద్‌ అలవిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అని నాకు కూడా తెలియదు” అని మిలాద్‌ సోదరుడు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. డిసెంబర్‌ 13న భద్రతా అధికారులు తమ అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేసి, మిలాద్‌ ఫోన్‌ , ల్యాప్‌టాప్‌లను స్వాధీనంచేసుకున్నారని తెలిపారు.
గతేడాది సెప్టెంబర్‌లో హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న మాహ్సా అమ్ని కస్టడీలో మరణించిడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గన్నవారిపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నారు.
గత సెప్టెంబర్‌ నుండి ఇప్పటివరకు సుమారు 470 మంది ఆందోళనకారులను చంపినట్టు మానవహక్కుల నిపుణులు వెల్లడించారు.  18వేల మందికి పైగా అరెస్టయ్యారని అంచనా వేస్తున్నారు. ఆ నిరసనల్లో అరెస్టయిన బాధితులు, మరణించిన వారికుటుంబసభ్యుల కథనాలను మిలాద్‌ అలవి మీడియాలో పోస్టు చేసేవారు.
 దీంతో  ఆయనను  ఈ  ఏడాది   ప్రారంభంలో  అదుపులోకి తీసుకుంది. సుమారు 62 మంది జర్నలిస్టులు ప్రస్తుతం జైలులో ఉన్నారని ఇరాన్‌ మానవ హక్కుల సంస్థ తెలిపింది. టెహ్రాన్‌ దినపత్రిక షార్గ్‌లో పనిచేస్తున్న మిలాద్‌ అలవి, సామాజిక వేత్త సయీద్‌ మదానీలు  జైలులో ఉన్నట్లు తెలిపింది.
ఇజ్రాయిల్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు మెహదీ బహ్మన్‌కు ఇరాన్‌ కోర్టు మరణశిక్ష విధించింది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌లమధ్య శాంతి స్థాపనకు సయీద్‌ మదానీ కృషి చేశాడు.  దీంతో గూఢచర్యం ఆరోపణలతో గతేడాది అక్టోబర్‌లో ఆయనను ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. విచారణలేకుండానే డిసెంబర్‌లో మరణ శిక్ష విధించింది.కాగా, విదేశీ శక్తులు దేశవ్యాప్తంగా నిరసనలను ప్రేరేపిస్తున్నాయంటూ ఇరాన్‌ పాలకులు ఆరోపిస్తున్నారు.