అమెరికా జాబ్‌ మార్కెట్‌ సంక్షోభంతో భారతీయుల కలలు భగ్నం

సగటు భారతీయ యువత, ముఖ్యంగా సాంకేతిక విద్య అభ్యసించినవారు అమెరికాలో ఉద్యోగం పొంది, డాలర్లు సంపాదించి, విలాసవంతమైన జీవనం సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. అందుకనే అమెరికాలో విదేశాల నుండి చదువుల కోసం వచ్చే వారిలో, టెక్ కంపెనీలలో ఉద్యోగాలలో చేరేవారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. 
 
అయితే, ప్రస్తుతం అమెరికా జాబ్‌ మార్కెట్‌ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆటమువంటి వారి కలలు భగ్నం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగాలు సంపాదించి, అమెరికాకు వెళ్లాలనుకునే వారే కాకుండా, ఇప్పటికే అక్కడ ఉద్యోగాలలో స్థిరపడిన వారు సహితం ఎప్పుడు తమ ఉద్యోగాలు ఉడుతాయో అంటూ కంగారు పడే పరిస్థితులు నెలకొన్నాయి. 
గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతున్నది. దీంతో ఇక్కడే ఉండాలా,  స్వదేశానికి తిరిగి వెళ్లాలా అని వారు అయోమయం చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలతో పలు టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
పెద్దపెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఇలా జాబ్‌లు కోల్పోయిన వారిలో చాలామంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీలో కొత్తగా నియామకాలు కూడా చేపట్టడం లేదు. అమెజాన్‌, మెటా, సేల్స్‌ఫోర్స్‌, ట్విట్టర్‌, ఉబర్‌ వంటి సంస్థలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
ఈ ఏడాది కూడా టెకీలకు గడ్డుకాలం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది లేఆఫ్‌లు భారీగా ఉంటాయని, హెచ్‌1బీలకు సైతం ఉద్యోగాలు దొరక్కపోవచ్చని అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే దేశాన్ని వీడక తప్పదు.
 ఉన్న ఉద్యోగం కోల్పోవడంతో తన నైపుణ్యంకు సంబంధం లేని ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని, భవిష్యత్ లో తిరిగి మంచి ఉద్యోగం రావచ్చనే ఆశతో మరికొందరు గడిపే ప్రయత్నం చేస్తున్నారు.