హర్యానా, పంజాబ్, హిసార్‌లలో చలిగాలులు!

హర్యానా, పంజాబ్, హిసార్‌లలో చలిగాలులు!

ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో వరుసగా నాలుగో రోజూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  సఫ్దర్‌జంగ్‌లో 1.9 డిగ్రీలు, రిడ్జ్‌లో 2.2 డిగ్రీలు, ఆయా నగర్‌లో 2.6, లోధీ రోడ్‌లో 2.8, పాలమ్‌లో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గాలి నాణ్యత 359 పాయింట్లకు పడిపోవడంతో వెరీ పూర్‌ కేటగిరీలోకి వెళ్లింది.

హర్యానా, పంజాబ్‌లలో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత చాలా ప్రదేశాలలో సాధారణం కంటే తక్కువకు పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా పడిపోయింది. హర్యానా, పంజాబ్‌లో ఆదివారం పొగ మంచు దట్టంగా కమ్ముకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవారు జామున అయితే ముందున్నవి కూడా కనబడనంతగా పొగమంచు కమ్ముకుంది.

కాగా హిసార్, హర్యానాలో కొంకర్లు పోయే చలి తిష్టవేసుకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్ కన్నా కింద నమోదయింది. సిర్సా, భివాని, రోహతక్, నార్‌నౌల్, అంబాలాలో చలి విపరీతంగా ఉంది.  పంజాబ్‌లోని అమృత్‌సర్‌, పటియాల, అంబాలా, చండీగఢ్‌, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో దృష్య గోచరత మందగించిందని అధికారులు వెల్లడించారు. బీహార్‌లోని గయా, భాగల్‌పూర్‌, లక్నో, గ్వాలియర్‌లో 200 మీటర్ల వరకు ముందున్న వాహనాలు కనిపించడం లేదని తెలిపారు.

రైళ్లపై తీవ్ర ప్రభావం 

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న పొగమంచు నార్తర్న్‌ రైల్వే రీజియన్‌లోని రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మి ఉండటంతో విజిబిలీటీ బాగా తగ్గిపోయింది. ట్రాక్‌ సరిగా కనిపించడంలేదు. దాంతో రైళ్లు నిదానంగా రాకపోకలు సాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో.. పూరి-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ (4.30 గంటలు ఆలస్యం), గయ-న్యూఢిల్లీ మహబూది ఎక్స్‌ప్రెస్‌ (4.30 గంటలు ఆలస్యం), బరౌనీ-న్యూఢిల్లీ క్లోన్‌ స్పెషల్‌ (4.10 గంటలు ఆలస్యం), హౌరా-న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్‌ (4.30 గంటలు ఆలస్యం), భాగల్‌పూర్‌-ఆనంద్‌ విహార్‌ విక్రమ్‌శీల ఎక్స్‌ప్రెస్‌ (3.50 గంటలు ఆలస్యం), రేవా-ఆనంద్‌ విహార్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (5 గంటలు ఆలస్యం) ఉన్నాయి.