
ఈ సంవత్సరంలో ఎన్నికలు జరిగే తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో- ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలంటే- 2023లో జరిగే అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన ఆయన కోర్బాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులే తమను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామని, ఫలితంగా అశాంతియుత వాతావరణాన్ని తొలగిపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. 2024లో జరిగే సరత్ర్వక ఎన్నికల లోపుగానే మొత్తం దేశాన్ని మావోయిస్టు సమస్య నుండి విముక్తి చేసే దిశలో పని చేస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను తీవ్రవాదం సమస్య లేకుండా చేయబోతున్నామని స్పష్టం చేశారు.
ఈ ప్రాంత ప్రజలలో అసంతృప్తి నెలకొనడానికి గత ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వారికి చేరకపోవడమే కారణం అని ఆయన చెప్పారు. సామాన్య, అమాయక ప్రజలు తీవ్రవాదం వైపు మొగ్గకుండా చేయడానికి ప్రతి మారుమూల ప్రాంతంకు అభివృద్ధి ఫలాలు అందేటట్లు చేయడం ముఖ్యమని పేర్కొంటూ, ఆ దిశలో ఇప్పుడు తీవ్రమైన కుర్షి జరుగుతున్నదని తెలిపారు.
ఒక వంక రోడ్ల నిర్మాణం, పాఠశాలల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను ప్రధాన స్రవంతిలో కలిపే కృషి జరుగుతున్నదని, మరోవంక వామపక్ష తీవ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. 2009 నాటితో పోల్చుకొంటే మావోయిస్టు సంబంధిత సంఘటనలు 2021 నాటికి నాలుగోవంతుకు పడిపోయాయని హోమ్ మంత్రి చెప్పారు.
2009లో దేశంలో 2,258 మావోయిస్టు సంబంధిత సంఘటనలు జరుగగా, 2021లో 509 మాత్రమే జరిగాయని ఆయన పేర్కొన్నారు. “బీజేపీ ప్రభుత్వం ఆయుధాలు ఎంచుకునే యువకులకు ఉపాధి, విద్యను అందించడమే కాకుండా, తమ చేతుల్లో ఆయుధాలు కలిగి ఉన్న వారితో పోరాడడం ద్వారా నిర్మూలించ గలిగింది. 2024 పార్లమెంటు ఎన్నికలలోపు మావోయిజం రహిత దేశంగా మార్చడమే మా ప్రభుత్వ ప్రయత్నం” అని వెల్లడించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి వర్గం కోసం పనిచేస్తున్నదని చెబుతూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, వంట గ్యాస్, విద్యుత్, పంపు నీటి సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ అధికారంలో ఉన్న భూపేష్ భాగేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అవినీతి, పెరుగుతున్న నేరాలు, అటవీ ప్రాంతాలలో అడవుల తొలగింపుకు మాత్రమే పేరొందినదని విమర్శించారు.
“ఐదేళ్ల పాలనలో మీరు ఏమి చేశారని ప్రజలు అడిగితే భూపేష్ బఘేల్‌ను ఏమి చెబుతారని నేను అడగాలనుకుంటున్నాను. ఆయన ఏమీ చేయలేదని కాదు. అవినీతి, అత్యాచారాలు, నేరాలను పెంచడానికి, గిరిజనుల అడవులను నరికివేయడానికి అతను పనిచేశారు” అని అమిత్ షా ఎద్దేవా చేశారు.
పైగా, జిల్లా మినరల్ ఫౌండేషన్ (డిఎంఎఫ్) ఫండ్‌లో బఘెల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు. “ప్రజల (ఖనిజ సంపన్న ప్రాంతాలలో నివసించే) అభివృద్ధి, సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం డిఎంఎఫ్ ని ప్రారంభించింది… దీని ద్వారా ఛత్తీస్‌గఢ్ రూ. 9,243 కోట్లు పొందింది. అయితే ఆ నిధులతో ప్రభుత్వం ఏమి చేసింది?” అని ప్రశ్నించారు.
“ఆ నిధులు ఎక్కడికి పోయాయో నేను చెప్పగలను. మీ ప్రాంతంలోని కాంగ్రెస్ సభ్యుల ఇళ్లు చూడండి. గతంలో స్కూటర్‌పై వెళ్లే వారి వద్ద ఇప్పుడు ఆడి కార్లు ఉన్నాయి. వారి ఇళ్లు మూడంతస్తుల భవనాలుగా మారాయి. డీఎంఎఫ్ నిధుల్లో కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది” అంటూ కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాలని, తద్వారా దేశం మొత్తం మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందనే సంకేతాలను ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా హిందీ భాషలో మాట్లాడతారని, దేశం పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తి భావాన్ని ఆయన ఈ విధంగా చాటుతుంటారని అమిత్ షా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అలా జరిగేది కాదని విమర్శించారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోఉన్నప్పుడు ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు తీవ్రవాదం పెద్ద ఎత్తున అల్లకల్లోలానికి కారణమైందని కేంద్ర హోమ్ మంత్రి గుర్తు చేశారు. మందుపాతరల ద్వారా అశాంతియుత వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు.
ఛత్తీస్ గఢ్ లో వేళ్లూనుకుపోయిన నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే నిర్మూలిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన చర్యలను 2014లోనే ప్రారంభించామని, వాటిని మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!