డిసెంబర్‌లో 1.49లక్షలకోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం

డిసెంబర్‌-2022లో దేశంలో జీఎస్టీ ఆదాయం 15శాతం పెరిగి రూ.1.49లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,49,507 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.26,711 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.33,357 కోట్లు, ఐజీఎస్టీ రూ.78,434 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.40,263 కోట్లతో కలిపి), సెస్ రూ.11,005 కోట్లుగా ఉంది.
 
ప్రభుత్వం రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా ఐజీఎస్‌టీ నుంచి సీజీఎస్‌టీలో రూ.36,669 కోట్లు, ఎస్‌జీఎస్‌టీలో రూ.31,094 కోట్లు సెటిల్ చేసింది.  డిసెంబర్ 2022 నెలలో రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.63,380 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ. 64,451 కోట్లు. డిసెంబర్‌లో వరుసగా పదో నెలలో జీఎస్టీ ఆదాయం రూ. 1.40 లక్షల కోట్ల కంటే ఎక్కువగా వచ్చింది.
 
అంతకు ముందు నెల నవంబర్‌లో జీఎస్టీ వసూల్లు ఏడాది ప్రాతిపదికన 11శాతం పెరిగి 1.46లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్ల వసూలయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది.