చిన్న చిన్న పదవులలో ఉన్న వారైనా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా చాలా హంగూ, ఆర్భాటాలతో చేస్తుండే కాలంలో అంతుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి అంతిమ సంస్కారాలు ఎవ్వరూ ఊహించని విధంగా ఎలాంటి ప్రచారం, ఆడంబరం లేకుండా ముగించారు. అంతేకాదు, వెంటనే అధికార విధులకు హాజరయ్యారు.
అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో మోదీ తల్లి హీరాబెన్ రెండ్రోజుల క్రితం చేరారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. ఉదయం 6 గంటలకు మరణ వార్త అందరికీ తెలిసింది. తల్లి మరణవార్త తెలియగానే మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. 9 గంటల 30 నిమిషాలకు సామాన్యుడిలా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తల్లి పాడె మోసి..చితికి నిప్పంటించారు ప్రధాని మోదీ. ఇంత సాధారణంగా తల్లికి వీడ్కోలు పలకడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇక ప్రధాని మోదీ అభిమానుల నుండి నినాదాలు లేవు కదా దహనసంస్కారాలకు ఎకరం భూమిని కూడా చదును చేయలేదు. ఆమె మృతదేహంపై జాతీయ జెండా లేదు. ఆమెను దహనం చేయడానికి గంధపు చెక్క వాడలేదు. వీఐపీ సందర్శనలు లేవు.. ట్రాఫిక్ జామ్‌లు లేవు.. నినాదాలు చేసే అభిమానులు లేరు.. సమాధి కోసం ఎకరాల భూమి లేదు.. అంటూ మోదీని కీర్తిస్తున్నారు. సాధారణంగా ఓ సామాన్య వ్యక్తికి ఎలాగైతే అంత్యక్రియలు జరుగుతాయో అదేవిధంగా సాదాసీదాగా అంత్యక్రియలు జరిపారు.
దేశ ప్రధాని తల్లి అంత్యక్రియలు ఇలా సాదాసీదాగా జరగడం గొప్ప విషయమని అంటున్నారు. అంతేకాదు అంత్యక్రియలు పూర్తవ్వగానే ప్రధాని మోదీ మళ్లీ తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం 11 గంటలకే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. గాంధీ నగర్‌లో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ ఏడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు.
షెడ్యూలు ప్రకారం ఆయన పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం పర్యటించవలసి ఉంది. కానీ ఆయన మాతృమూర్తి కన్నుమూయడంతో ఆమె పార్దివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గాంధీ నగర్ వెళ్ళారు. అనంతరం వర్చువల్ విధానంలో ఈ రైలును ప్రారంభించారు. ఇది హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య నడుస్తుంది.
మోదీ నిజమైన కర్మయోగి
తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి హీరాబెన్ అంత్యక్రియుల ముగిసిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్ర మోదీ విధుల్లో మునిగి పోయి సహచర మంత్రులకు ఆదర్శంగా నిలిచారు. వారంతా ప్రధానిని కర్మయోగిగా అభివర్ణిస్తూ వ్యక్తిగత బాధకన్నా దేశం ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
కేరళలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ, తమ అధికార కార్యక్రమాలును రద్ద్దు చేసుకోవద్దని, వాటిని పూర్తి చేసిన తర్వాతే ఢిల్లీకి రావాలని తన మంత్రివర్గ సహచరులందరికీ ప్రధాని చెప్పారని తెలిపారు.
ఆయన సూచన మేరకు హోంమంత్రి అమిత్ షా కూడా కర్ణాటకలో తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి అంత్యక్రియలు పూర్తయిన కొద్ది గంటలకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ నిజమైన కర్మయోగి అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటూ, తమలాంటి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
పలువురు బిజెపి నేతలు సైతం బెంగాల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్న చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకుంటూ వ్యక్తిగత బాధను సైతం దిగమింగుకుని కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానిపై ప్రశంసలు వర్షం కురిపించారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్