`మిషన్ 90’లో తెలంగాణాలో అన్ని సీట్లపై బిజెపి కన్ను!

`మిషన్ 90’లో తెలంగాణాలో అన్ని సీట్లపై బిజెపి కన్ను!
వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తెలంగాణాలో 90 సీట్లలో గెలుపొంది అధికారంలోకి వచ్చే లక్ష్యంగా `మిషన్ 90′ ప్రారంభించిన బిజెపి అన్ని సీట్లపై కన్ను వేస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలలో పార్టీని సింసిద్ధం చేయవలసిందిగా పారీ నాయకులను ప్రత్యేకంగా ప్రభారీలను(ఇన్‌చార్జిలు) బిజెపి ఆదేశించింది. 
 
నగరంలోని షామీర్‌పేటలో జరిగిన పార్టీ విస్తారక్‌ల(పూర్తికాల కార్యకర్తల) శిక్షణా శిబిరంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ మార్గదర్శకత్వంలో పార్టీ నాయకులు చర్చించారు. తెలంగాణలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో పార్టీని సింసిద్ధపరచడంతో పాటు ప్రజలకు చేరువ కావడంపై చర్చించారు. 
 
2013 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బిజెపి ఊహిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా సంసిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు పర్యవేక్షకులను నియమించిన బిజెపి ఆయా నియోజకవర్గాలలో పన్నా ప్రముఖ్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని శిక్షణా శిబిరంలో ఆదేశించింది.
 
 ‘మిషన్ 90’ లక్ష్యంతో కొత్త ఏడాదిలో వరుస కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతున్నది. 10 నెలల రోడ్ మ్యాప్ లో భాగంగా నాలుగు నెలల రోడ్ మ్యాప్​ను రెడీ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల​ను జనంలో ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి కేంద్రం ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చిందో వివరించనుంది. 
 
కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్ తయారు చేసి, వచ్చే ఏప్రిల్ లో అమిత్ షాతో భారీ బహిరంగసభ జరిపి విడుదల  చేయాలని నిర్ణయించింది.  జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో పది వేల గ్రామ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీని హైదరాబాద్ కు ఆహ్వానించి, ఏడు లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. వీటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది.
గురువారం హైదరాబాద్ శివారులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్​, విస్తారక్​, ప్రభారీ, కన్వీనర్ల సమావేశంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  చేసిన దిశానిర్దేశంతో నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా,  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని శుక్రవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాలుగంచెల వ్యవస్థతో ముందుకు వెళ్తున్నామని ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.  లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగి పోయారని, అందుకే ‘కేసీఆర్ హఠావో…తెలంగాణ బచావో’ పేరుతో జనంలోకి వెళ్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులతో సమ్మేళనాలు, సదస్సులు నిర్వహించినట్లే ఇప్పుడు కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.