శ్రీశైలం మల్లన్న ఆలయంలో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో పర్యటించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలీ ప్యాడ్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదికి తెలంగాణ గవర్నర్ తమిళసై. ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా సహా పలువురు ఘన స్వాగతం పలికారు. 
 
ముందుగా శీశైలంలోని సాక్షి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మల్లన్న, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు .
ఈ సందర్భంగా మల్లికార్జున స్వామివారి ఆలయ రాజగోపురం వద్ద రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళ సై కు పూర్ణకుంభంతో అర్చకులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన తదితరులు స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. 
 
మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు.  అనంతరం శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవార్లకు కుమార్చన జరిపించుకున్నారు. అనంతరం భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాలను, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి చిత్రపటాల జ్ఞాపికను   అందజేశారు.
అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో రు. 43.08 కోట్లతో ప్రసాద్ స్కీం కింద సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది ప్రారంభించారు. శ్రీశైలం పర్యటన అనంతరం శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు.
హైదరాబాద్ లో ఘనస్వాగతం 

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శ్రీశైలం నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం లభించింది.  గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్, పలువురు మంత్రులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లు పుష్ప గుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతకాల విడిది చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్మూ బస చేయనున్నారు.