భారత్ లో ఇబ్బందైతే  పాక్ కు వెళ్ళిపో… ఆర్జేడీ నేతపై మండిపాటు 

భారత్ లో ఇబ్బందైతే  పాక్ కు వెళ్ళిపో… ఆర్జేడీ నేతపై మండిపాటు 

భారత దేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని బిహార్‌కు చెందిన ఆర్జేడీ నేత అబ్దుల్ బరి సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ముస్లిం నేతలు మండిపడుతున్నారు. ఈ దేశంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, తనకు లభిస్తున్న అన్ని రకాల సదుపాయాలను వదిలిపెట్టి, పాకిస్థాన్ వెళ్లిపోవాలని  సలహా ఇచ్చారు.

ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మొహిసిన్ రజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి ఆరోపణలు చేసేవారు అనుకోకుండా వచ్చిన అవకాశం వల్ల భారత దేశంలో ఉంటున్నవారని ధ్వజమెత్తారు.  వివిధ అంశాలను పరిశీలించి, పెద్దల మార్గదర్శనంలో భారత దేశంలో ఉంటున్నవారు కాదని ఆయన మండిపడ్డారు.

ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖీ గత వారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతదేశంలో ముస్లింలపై వ్యతిరేకత ఉందని, వారు అభద్రతా భావంతో ఉన్నారని ఆరోపించారు.

‘‘దేశంలోని పరిస్థితులను చెప్పడం కోసం నేను నా వ్యక్తిగత ఉదాహరణను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఓ కుమారుడు ఉన్నాడు. వాడు హార్వర్డ్‌లో చదువుతున్నాడు. ఓ కుమార్తె ఉంది. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో డిగ్రీ చేసింది. విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకోవాలని నేను వారికి చెప్పాను. సాధ్యపడితే అక్కడే పౌరసత్వం తీసుకోవాలని చెప్పాను’’ అని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మొహిసిన్ రజా స్పందిస్తూ, అబ్దుల్ సిద్ధిఖీ అనుకోకుండా భారత దేశంలో ఉంటున్న ముస్లిం అని ధ్వజమెత్తారు. ఆయన పెద్దల సలహా, మార్గదర్శనం, వివిధ అవకాశాలను పరిశీలించడం ద్వారా ఈ దేశంలో ఉంటున్న ముస్లిం కాదని స్పష్టం చేశారు.

మన దేశంలో ఉంటున్న ముస్లింల భావన ఆయన అభిప్రాయానికి అనుగుణంగా లేదని ఆయన తేల్చి చెప్పారు. పొరపాటున మన దేశంలో ఉంటున్నవారి భావన అది అని పేర్కొంటూ ఆయన అభిప్రాయానికి అనుగుణంగా ఆలోచించేవారి పూర్వీకులు పాకిస్థాన్ వెళ్లిపోవాలని కోరుకుని, అది సాధ్యపడకపోవడం వల్ల ఇక్కడ ఉండిపోయినవారని ఎద్దేవా చేశారు. తాము పాకిస్థాన్ వెళ్లిపోలేకపోయామనే నిరాశ వారిలో ఇప్పటికీ ఉందని దయ్యబట్టారు.

పాకిస్థాన్‌లో ఉన్న స్వేచ్ఛ వంటి స్వేచ్ఛను వారు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నందువల్ల ఈ భావన వారికి ఉందని పేర్కొన్నారు. వారు హిందుస్థాన్‌ను కాకుండా పాకిస్థాన్‌ను కోరుకుంటున్నారని ఆరోపించారు. ఇది స్వతంత్ర భారత దేశమని పేర్కొంటూ ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన హక్కులు ఉన్నాయని, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు.