ప్రముఖ కథా రచయిత మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’ నవలకు 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దేవదాసీ వ్యవస్థ నేపథ్యంగా ఈ నవల సాగుతుంది. ఈ వ్యవస్థ రద్దు కాలంలో ఆలయాలకు దూరం కావలసి వచ్చిన దేవదాసీల మానసిక స్థితికి నవల అద్దం పడుతుంది.
గతంలో ఆటా బహుమతి అందుకున్న ఈ నవల మీద తెలుగు సాహిత్యంలో విస్తృతమైన చర్చే జరిగింది. ఐదు దశాబ్దాలకు పైగా కథరచన చేస్తున్న నరేంద్ర ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం కుమారుడు. తండ్రీకొడుకులు ఇద్దరికీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించడం అరుదైన అంశం.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులుగా నరేంద్ర పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు 86 కథలు, నాలుగు నవలలు, ఏడు రేడియో నాటికలు, అనేక విమర్శనా వ్యాసాలు ప్రచురించారు. పలు కథాసంకలనాలకు సంపాదకత్వం వహించారు. 16జూన్ 1957లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారి పల్లెలో నరేంద్ర జన్మించారు. ప్రముఖ కదా రచయిత మధురాంతకం రాజారామ్ కుమారుడు.
ఇంగ్లీషులో ఎంఏ చేసిన నరేంద్ర నయనతారసెహగల్ రచనలపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఎస్వీయులో ఇంగ్లీష్ ఆచార్యులుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. నరేంద్ర సోదరుడు మహేంద్ర, సోదరి, తల్లి కూడా కథా రచయితలే కావడం విశేషం.
అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ కు అవార్డు
కాగా, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ కవులలో ఒకరైన పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీన్‌పోయెమ్స్‌ని పవన్ కే వర్మ ఆంగ్లానువాదం చేయగా, వారాల ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
ఇందులో మొత్తం 58 కవితలుండగా అవన్నీ ప్రకృతికి సంబంధించినవే కావటం విశేషం. మనిషికి, ప్రకృతికి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా కవి ఎంతో హృద్యంగా చెప్పారు. ఈ పురస్కారం కింద రచయితలకు తామ్ర ఫలకం, రూ.50 వేల నగదును అందజేయనున్నారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష