అప్పుల ఊబిలో ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతున్నట్టుగా పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.

కేవలం అప్పుల భారం మాత్రమే కాకుండా ఏటా అప్పుల శాతం గణనీయంగా పెరిగిపోతోంది. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదైంది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. 

తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా ఆ తరువాత భారీగా తగ్గింది. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా.. 2021 నాటికి ఏపీ స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతంగా అప్పులు ఉన్నాయి. 

సోమవారం లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. బడ్జెట్‌లో చూపించిన అప్పులు కంటే ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను భారీగా చేస్తోందని ఆయన పేర్కొన్నారు.