సాగర్ నీటి వినియోగంపై కుదరని ఏకాభిప్రాయం

సాగర్ నీటి వినియోగంపై కుదరని ఏకాభిప్రాయం

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నీటి వినియోగం పై తెలుగురాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరేదు. ఏపీ కి నీటి కేటాయింపులు అధికంగా ఉన్నాయనీ, జల విద్యుత్ ఉత్పాదనకు ఇబ్బందులు వాటిల్లుతున్నాయనీ, రూల్‌ కర్వ్య్‌ పాటించడం లేదని తెలంగాణ చేసిన అభ్యంతరాలను కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు ముందు ఏపీ తోసిపుచ్చింది.

ట్రిబ్యునల్‌ అవార్డుమేరకే వినియోగాలున్నాయని వాదించింది. అయితే ఇరుపక్షాలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం నీటి వాటాల పెంపుపై చేసిన వాదనలు విన్న కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఈ అంశాన్ని సీడబ్ల్యూసీ కి రెఫర్‌ చేయనున్నట్లు తెలిపింది. శ్రీశైలం రూల్‌ కర్వ్య్‌ కు సంబంధించి రెండురాష్ట్రాలు అంగికరించాయి. శ్రీశైలం నుంచి ఏపీ కి ట్రిబ్యునల్‌ కేటాయించిన 34 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

రిజర్వాయర్ల మేనేజింగ్‌ కమిటీ వాదనలు వినిపించేందుకు కెఆర్‌ఎంబీ చర్చలను సోమవారానికి వాయిదా వేసింది. కృష్ణానదీ జలాల పంపకంలో తెలుగురాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న వివాదాల పరిష్కారంకోసం జలసౌధలో శనివారం కెఆర్‌ఎంబీ సభ్యుడు, ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పి ళ్లే ముందు తెలంగాణ ఇంజనీరంగ్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ రావు, ఏపీ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణ రెడ్డి వాదనలు వినిపించారు.

కృష్ణా నదీ జలాలవాటల్లో జరిగిన అన్యాయాన్ని తెలంగాణ వినిపించింది. కనీసం 575 టీఎంసీల నీటి కేటాయింపు ఉండాలని పట్టిబట్టింది. తెలంగాణలోని కరవుజిల్లా మహబూబ్‌ నగర్‌, ప్లోరైడ్‌ బాధిత జిల్లా నల్గొండ కు సాగునీరు, తాగునీరు అందించేందుకు నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉండాలని పట్టుబట్టింది.

కాగా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలించుకు పోతుంటే కెఆర్‌ఎంబీ ఎందుకు స్పందించడంలేదని మురళీధర్‌ రావుప్రశ్నించగా శ్రీశైలం నుంచి 34 టీఎం సీ నీటిని తరలించేందుకు మాత్రమే అనుమతి ఉందని కేఆర్‌ఎంబీ వివరించింది. ఈమేరకే నీటి కేటాయింపులు ఉంటాయని తెలంగాణను కేఆర్‌ఎంబీ శాంత పర్చేందుకు ప్రయత్నించింది.

జలాశయాల నిర్వహణకు శాశ్వత కమిటీ వేసేందుకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే వాటాల అంశంతేల్చాల్సిందేనని పట్టుబట్టడంతో సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.నాగార్జున సాగర్‌ అంశంపై కేంద్ర జలసంఘం సూచనలమేరకే నిర్ణయాలు ఉంటాయనీ ఈ అంశాన్ని సీడబ్ల్యూసీకి పంపించనున్నట్లు కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

ఇలా ఉండగా, కృష్ణానదీ మిగులు జలాలపై స్పష్టత వచ్చిందని కేఆర్‌ఎంబీ ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్ల్లై చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి పై స్పష్టత వచ్చిందని తెలిపారు. నాగార్జున సాగర్‌ రూల్‌ కర్వ్య్‌ పై ఇంకా స్పష్టతరాలేదని చెప్పారు. అయితే నాగార్జున సాగర్‌ కు సంబంధించి తెలుగురాష్ట్రాలు వినిపించిన వాదనలను, అభ్యంతరాలను సీడబ్ల్యూసీకి రెఫర్‌ చేయనుట్లు తెలిపారు.

అలాగే ప్రాజెక్టుల జల విద్యుత్ ఉత్పత్తి , నీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు చెప్పారు. 50:50 ఫవర్‌ షేరింగ్‌ కు తెలంగాణ,ఆంధ్ర అంగీకరించాయని తెలిపారు. మిగులు జలాల విషయంలో స్పష్టత వచ్చిందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులు పూర్తీగా నిండి ఓవర్‌ ఫ్లో అయిన అనంతరమే వరదలను మిగులు జలాల కింద పరిగణించేందుకు అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.