జీ20 అధ్యక్ష బాధ్యతను చేపట్టిన భారత్ 

బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ కూటముల్లో బలమైన శక్తిగా పేరొందిన జీ20 అధ్యక్ష బాధ్యతను గురువారం చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 
 
జీ20 అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన భారత్‌ ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అనే థీమ్‌ స్ఫూర్తితో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. భారత్‌ అందరినీ కలుపుకుని జీ20 అజెండా రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. సరికొత్త బాధ్యతల్లో భారత్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ముర్ము ట్వీట్‌ చేశారు.
 
బాధ్యతలు చేపట్టిన తరువాత మొదవటిసారిగా యూనివర్శిటీ కనెక్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 75విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్ధులు, ప్రముఖ విద్యావేత్తలు, రీసెర్చర్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ విస్తృతమైన సంప్రదింపుల ద్వారా అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 
 
ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలతో కూడిన గ్లోబల్‌ సౌత్‌ (పారిశ్రామిక ప్రపంచం) దేశాల వాణిని వినిపించాలన్నది భారత్‌ లక్ష్యంగా వుంటుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా చాలా కీలకమైన సమయంలో భారత్‌ ఈ బాధ్యతలు చేపట్టిందని చెప్పారు. 
 
ఇంధన భద్రత, ఆహార భద్రత, వైద్య సంరక్షణ, వాతావరణ మార్పులపై కార్యాచరణ, వాతావరణ న్యాయం వంటి అంశాలపై ఆందోళనలను భారత్‌ లేవనెత్తుతుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా జి-20 అధ్యక్ష బాధ్యతల ప్రాముఖ్యతను గురించి అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ఛైర్మన్‌ ఎం.జగదీష్‌ కుమార్‌ తెలిపారు.