శబరిమల యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ఆదేశం

శబరిమల యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ఆదేశం
శబరిమల యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డ్‌ , కొచ్చిన్‌ దేవస్వోమ్‌ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. నిలక్కల్‌, పంబా, సన్నిధానం, ట్రెక్కింగ్‌ మార్గాలు, యాత్రికులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. 
 
దేవస్థానం అధికారులకు ఆలయ సలహా కమిటీలు అవసరమైన సహాయాన్ని అందించాలని కోర్టు ఆదేశించింది. సహాయ దేవస్థానం కమీషనర్‌ ఎడతావలం (ట్రాన్సిట్‌ క్యాంపులు) వద్ద భక్తులకు అందించిన సౌకర్యాలను తనిఖీ చేయాలనీ, డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌ త్రిస్సూర్‌ జిల్లాలోని గురువాయూర్‌ ఆలయంలో సౌకర్యాలను కూడా అంచనా వేయాలని తెలిపింది.
శబరిమలలో నవంబర్‌ 16న మండల పూజ ప్రారంభం కానుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవోసమ్‌ బోర్డ్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా బోర్డు వర్చువల్‌ క్యూలైన్‌ టోకెన్ల జారీని కూడా ప్రారంభించింది.  శబరిమల దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు వర్చువల్‌ క్ఖ్యూ సిస్టమ్‌ను అమలు చేయడం, నిర్వహణపై శబరిమల ప్రత్యేక కమిషనర్‌ నివేదిక ఆధారంగా దాఖలైన సూవో పిటిషన్‌ను కేరళ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఈ అంశాన్ని న్యాయమూర్తులు అనిల్‌ కె నరేంద్రన్‌, జస్టిస్‌ పిజి అజిత్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పరిశీలించింది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యమైతే కోర్టుకు నివేదించాలని పేర్కొంది. ట్రావెన్‌కోర్‌, కొచ్చిన్‌ దేవస్వం బోర్డుల పరిధిలో 59 ఎడతావళాలు ఉన్నాయి. మండల తీర్థయాత్రకు సంబంధించి గురువాయూర్‌ ఆలయంలో కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ అంశాన్ని కోర్టు నవంబర్‌ 15న తదుపరి విచారణకు తీసుకోనుంది.
వర్చువల్‌ క్ఖ్యూ పద్దతిని రద్దు చేసుకొనే సదుపాయం లేకపోయినప్పటికీ, రిజర్వేషన్ చేసుకున్నవారు రాని పక్షంలో అప్పటికప్పుడు ఆ స్థానంలో బుకింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను నివేదించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.