 
                జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. పాకిస్థాన్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు కాశ్మీర్ నుండి వచ్చిన ఆయుధాలను తీసుకెళ్లడం కోసమే వారు వచ్చారని తెలిసింది. 
నర్వాల్‌లోని జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న క్రమంలో పెట్రోలింగ్ పార్టీ.. జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ ట్యాంకర్ హైవేపై ఆగిఉండటాన్ని గమనించారు. దీంతో ట్యాంకర్‌ను అక్కడినుంచి తీయాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు కొద్ది దూరంలో ఉన్న నర్వాల్ సిద్రా బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఎన్విరాన్‌మెంటల్ పార్క్ వద్ద ట్యాంకర్‌ను నిలిపాడు.
అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు మరోసారి ఆ లారీని అక్కడినుంచి తీయాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు ముందుకు వెళ్లకుండా యూటర్న్ తీసుకుని మొదట ఆపి ఉంచిన ప్రాంతానికే వెళ్లాడు.  అనుమానం వచ్చిన పోలీసులు.. డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతనితోపాటు ఉన్న ట్యాంకర్‌లో ఉన్న మరో ఇద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను మొహమ్మద్ యాసిన్‌గా, మరో ఇద్దరిని ఫర్హాన్ ఫరూఖ్, ఫరూఖ్ అహ్మద్‌గా గుర్తించారు.  యాసిన్ జైషే ఉగ్ర సంస్థకు సానుభూతిపరుడని, ఇప్పటికే అతనిపై యూఏపీఏ సెక్షన్లపై కేసులు నమోదయ్యాయని గుర్తించారు. దీంతో తమదైన శైలిలో విచారించగా  తాను జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన షహబాజ్ ఆదేశాల మేరకు ఆయుధాలు తీసుకెళ్లడానికి జమ్మూకి వచ్చానని చెప్పాడు.
వాటిని లోయలో ఉన్న ఉగ్రవాదులకు అందించాలని తనను ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటికే ఆయుధాలు తీసుకున్నానని, ట్యాంకర్‌లో వాటిని తరలిస్తున్నానని తెలిపాడు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు ట్యాంకర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో అందులో మూడు ఏకే-56 రైఫిళ్లు, పిస్తోల్, తొమ్మిది మ్యాగజైన్లు, 191 రౌండ్ల బుల్లెట్లు, ఆరు గ్రనేడ్లు, ఆయుధ సామాగ్రిని గుర్తించారు.
                            
                        
	                    




More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు