గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో తిరిగి బీజేపీ ప్రభుత్వాలే!

* ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం 

వచ్చే నెల మొదట్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తున్నది.

గుజరాత్ లోని 182 సీట్లలో 111 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ లోని 68 సీట్లలో 41 సీట్లు బిజెపి గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలుపుతున్నది. కాంగ్రెస్ తిరిగి ప్రతిపక్ష స్థానంకు పరిమితం కావలసి వస్తుంది.  ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించిన ఆప్ గుజరాత్ లో మూడు సీట్లకు మించి గెలుచుకొనే అవకాశం లేదని, హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క  సీట్ కూడా వచ్చే అవకాశం లేదని అభిప్రాయం సేకరణ వెల్లడిస్తున్నది.

గుజరాత్ లో వరుసగా ఎడవ సారి గెలుపొందడమే కాకుండా  2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు బిజెపి  గెలుచుకుంటుంది. బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన సవాలుగా నిలుస్తుంది, కానీ అది రెండవ స్థానంలో ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో విజయం సాధించి ప్రభుత్వమును ఏర్పాటు చేసిన ఉత్సాహంలో పెద్ద ఎత్తున పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండంకెల సంఖ్యకు చేరుకోవడం సాధ్యం కాదని సర్వే స్పష్టం చేస్తున్నది.

ఒపీనియన్ పోల్ ప్రకారం, 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 119 సీట్లతో భారీ మెజారిటీని గెలుచుకోగా, కాంగ్రెస్ 59 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 81 సీట్లు, ‘ఇతరులు’ రెండు సీట్లు గెలుచుకున్నారు.

ఓటింగ్ శాతం వారీగా చూస్తే, బీజేపీకి 51.3 శాతం, కాంగ్రెస్‌కు 37.2 శాతం, ఆప్‌కి 7.2 శాతం ఓట్లు మాత్రమే రావచ్చని ఒపీనియన్ పోల్ పేర్కొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48.8 శాతం, కాంగ్రెస్‌కు 42.3 శాతం, ఇతరులకు 8.9 శాతం ఓట్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా: 61 సీట్లు ఉన్న సెంట్రల్ గుజరాత్‌లో, బీజేపీ 43, కాంగ్రెస్‌కు 17 సీట్లు; 54 స్థానాలున్న సౌరాష్ట్ర-కచ్‌లో బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 20 సీట్లు మాత్రమే రావచ్చు. దక్షిణ గుజరాత్‌లో 35 సీట్లు, బీజేపీకి 27, కాంగ్రెస్‌కు 7 సీట్లు రావచ్చు. ఉత్తర గుజరాత్‌లో 32 సీట్లు ఉండగా, బీజేపీకి 17 సీట్లు, కాంగ్రెస్‌కు 15 సీట్లు రావచ్చు.

హిమాచల్ లో బిజెపికి 41 సీట్లు

ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి 46% ఓట్లు వస్తాయి. మరోవైపు, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 42% ఓట్లు వస్తాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి 2% ఓట్లు మాత్రమే వస్తాయి. ఇవే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఖాతాలో 10 శాతం ఓట్లు పడుతున్నాయి.

సర్వే ప్రకారం మొత్తం 68 స్థానాలకు గాను 41 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి రావచ్చు. కాంగ్రెస్‌కు 25 సీట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2 సీట్లు ఇతరుల గెలుచుకొనే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.