400 మంది బలవంతపు మతమార్పిడిలో 9 మందిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
క్రైస్తవ మతంలోకి మారేందుకు తమకు ఎన్నో ఆశలు చూపించినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. మగంట్ పూరమ్‌లోని మలిన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ దేవీదేవతల విగ్రహాలకు దూరంగా ఉండాలంటూ తమను బలవంత పెట్టారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రాథమిక సమాచార నివేదిక ప్రకారం కరోనా సంక్షోభ సమయాన్ని నిందితులు ఆసరగా తీసుకున్నారు. మతమార్పిడి కోసం డబ్బు, ఆహారం ఆశ చూపించారని, ఇప్పుడు క్రైస్త్రవాన్ని అంగీకరిస్తూ హిందూ దేవీదేవతల విగ్రహాలను, పటాలను తొలగించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు స్థానిక బీజేపీ నేతతో కలిసి బ్రహ్మపుత్రి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.
తాము సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నట్టు వారు చెప్పారు. ”మతమార్పిడికి మాపై ఒత్తడి తెస్తున్నారు. ఆథార్ కార్డులలో పేర్లు మార్చుకోవాలని అడుగతున్నారు. దీపావళి రోజు పూజలు చేస్తుంటే ఇళ్లల్లోకి చొరబడి విగ్రహాలు ధ్వంసం చేశారు” అని ఆరోపించారు.
“మీరు మతం మార్చుకుని కూడా ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు? మేము నిరసన తెలిపితే చంపుతామంటూ బెదరించారు” అని బాధితులు శివ, బిన్వ, అనిల్, సర్దార్, నిక్కు, బసంత్, ప్రేమ, టిట్లి, రాణి తదితరులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాగా, తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ పీయూష్ సింగ్ తెలిపారు.