విదేశాంగ మంత్రి జైశంకర్‌పై యూఏఈ మంత్రి ప్రశంసల జల్లు

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ పై యూఏఈ కృత్రిమ మేధాశక్తి శాఖ సహాయ మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా ప్రశంసల జల్లు కురిపించారు. ‘నువ్వా-నేనా’ అన్నట్లు ఉన్న భౌగోళిక రాజకీయాల నడుమ ప్రపంచ వేదికపై భారత దేశ విదేశాంగ విధానాన్ని ఆయన నిలిపిన తీరు తనను చాలా ఆకట్టుకుంటోందని తెలిపారు.
ఢిల్లీలోని మేధావుల బృందం నిర్వహించిన CyFY2022లో ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొంటూ  చరిత్రను పరిశీలించినపుడు ప్రపంచం ఏకధ్రువ, ద్విధ్రువ, మూడు ధ్రువాలుగా ఉండేదని,  అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక పక్షాన్ని ఎంచుకోవలసి వచ్చేదని చెప్పారు.
భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ ప్రసంగాల్లో కొన్నిటిని తాను విన్నానని చెబుతూ ఏదో ఓ పక్షాన్ని ఎంచుకోవలసిన అవసరం లేదని యూఏఈకి, భారతలకు స్పష్టమైందని పేర్కొన్నారు. చివరికి కొన్ని పక్షాల ఉత్తమ ప్రయోజనాలు భౌగోళిక రాజకీయాలను నిర్ణయిస్తాయని తెలిపారు.
చరిత్రలో కనిపించిన నమూనా దురదృష్టవశాత్తూ ఇక లేదని, నేడు ఏ దేశమైనా తన ఉత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బాలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొంటూ యూఏఈ ప్రజలు హిందీ సినిమాలను చూస్తున్నారని, వారికి భారత దేశం పట్ల సహజసిద్ధమైన ఇష్టం ఉందని చెప్పారు.
భారత్-ఇజ్రాయెల్-యూఏఈ-అమెరికా కలిసి పని చేస్తున్నట్లుగానే భారత్-ఇజ్రాయెల్-యూఏఈ కలిసి పని చేయవచ్చునని తెలిపారు. పెట్టుబడులకు, వాణిజ్యానికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్తూ, వాణిజ్యం ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించడానికి ఇది సరైన సమయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని పెంచుకోవడం కోసం భారత్-యూఏఈ కలిసికట్టుగా పని చేయవచ్చునని విశ్వాసం వ్యక్తం చేశారు.