గూగుల్పై మరో రూ.936.44 కోట్ల జరిమానా

గూగుల్పై మరో రూ.936.44 కోట్ల జరిమానా
గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఈ వారంలో రెండోసారి భారీ జరిమానా విధించింది. అక్టోబరు 20న గూగుల్ పై  రూ.1,337.76 కోట్ల  ఫైన్ విధించగా,  తాజాగా ఇవాళ మరో రూ.936.44 కోట్ల జరిమానా వేసింది. 
 
మార్కెట్లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసి  ప్లే స్టోర్ పాలసీలకు విరుద్ధంగా గూగుల్ వ్యవహరించినందుకు ఈ జరిమానా విధించామని సీసీఐ వెల్లడించింది. ఇలాంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించొద్దని  ఆదేశించింది.  గూగుల్ ప్లే స్టోర్  లో పోటీ వ్యతిరేక పద్ధతుల (యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్ )కు తావు లేకుండా చేసేందుకు అనుసరించాల్సిన 8 దిద్దుబాటు చర్యలతో కూడిన సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్ ను సీసీఐ జారీ చేసింది.
 
మొబైల్ యాప్స్ డెవలప్ చేసే వారు బిల్లింగ్ కోసం తప్పకుండా గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (జీపీబీఎస్) నే వాడాలనే నిబంధన అమల్లో ఉంది. యాప్స్ నిర్వాహకులు పేమెంట్స్ పొందడానికి, ఇన్ యాప్ కొనుగోళ్ల కోసం కూడా జీపీబీఎస్ నే వాడాల్సి వస్తోంది. జీపీబీఎస్ వినియోగించని యాప్ డెవలపర్స్ .. వారి ప్రోడక్ట్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లో లిస్ట్ చేసుకునే పరిస్థితి లేదు. 
 
ఈవిధంగా ఏకపక్షంగా గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలు ఉన్నాయని సీసీఐ ఇవాళ విడుదలచేసిన ప్రెస్ రిలీజ్ లో ప్రస్తావించింది. యాప్ డెవలపర్స్ ఏదైనా థర్డ్ పార్టీ బిల్లింగ్ ప్రాసెసింగ్ సర్వీసును వాడుకోకుండా నిలువరించరాదని గూగుల్ కు సీసీఐ నిర్దేశించింది.