కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ లకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను మంత్రివర్గం నుండి తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితమని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను కేబినెట్ నుంచి తొలగించాలంటూ కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆయన లేఖ రాశారు. ‘మంత్రి బాలగోపాల్ గత బుధవారం తిరువనంతపురంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో మాట్లాడుతూ ప్రాంతీయవాదాన్ని లేవనెత్తారు. ఐక్యతను దెబ్బతీయాలని కోరుతూ ప్రసంగించారు’ అని ఆ లేఖలో గవర్నర్ ఆరోపించారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ మంత్రులను నియమిస్తారు. మంత్రులు గవర్నర్ `సంతృప్తి’గా ఉన్నంతకాలం వారు ఆ పదవిలో కొనసాగుతారు. ఇప్పుడు తాను `సంతృప్తి’ ఉపసంహరించుకొంటున్నట్లు గవర్నర్ తెలిపారు. అయితే గవర్నర్ సూచనను ముఖ్యమంత్రి విజయన్ మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ఆర్ధిక మంత్రి పట్ల తనకు `విశ్వాసం’ నెలకొన్నదని స్పష్టం చేశారు.
“ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చిన వారికి ఇక్కడి పరిస్థితుల గురించి తెలియదు” అంటూ గత వారం గవర్నర్ ను ఉద్దేశించి ఆర్ధిక మంత్రి బాలగోపాల్ చేసిన విమర్శలు గవర్నర్ కు ఆగ్రహం కలిగించాయి. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు తనను లక్ష్యంగా చేసుకొంటూ, గవర్నర్ హోదాను కించపరుస్తూ చేస్తున్న ప్రకటనల పట్ల హెచ్చరిక చేస్తూ, కఠిన చర్యలు తప్పవని అంటూ గవర్నర్ గత వారం ఓ ట్వీట్ చేశారు.

More Stories
మెస్సి టూర్లో గందరగోళం.. అభిమానుల అసహనం
తిరువనంతపురంలో మొదటి బిజెపి మేయర్!
జన గణనకు రూ.11,718 కోట్లు