
సామాన్యులకు చిన్న మొత్తాల్లో అప్పులు ఇచ్చి వారిని జలగల్లా పీడిస్తున్న చైనా లోన్ యాప్ సంస్ధలపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూర్‌లోని ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఈడీ ఈ దాడులు నిర్వహించింది.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ చైనా లోన్ యాప్ సంస్ధలపై కొరడా ఝుళిపించింది. ఈ లోన్ యాప్ కంపెనీలు చిన్న మొత్తాల్లో రుణాలు ఇచ్చి అప్పుల వసూళ్ల కోసం సామాన్యులను తీవ్రంగా వేధిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
లోన్ యాప్ కంపెనీలను చైనా జాతీయులు నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. భారతీయుల పత్రాలను ఫోర్జరీ చేసి వారిని డమ్మీ డైరెక్టర్లుగా చూపుతూ లోన్ యాప్ కంపెనీలు నేరపూరిత కార్యకలాపాలకు తెరలేపాయని గుర్తించామని పేర్కొంది.
పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకుల వద్ద ఉన్న పలు మర్చంట్ ఐడీలు, ఖాతాల ద్వారా లోన్ యాప్ కంపెనీలు తమ చట్టవిరుద్ధ లావాదేవీలను నడుతున్నాయని కనుగొన్నామని ఈడీ వర్గాలు వివరించాయి. చైనా లోన్ యాప్ కంపెనీల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు