హిందీ మీడియంలో వైద్య విద్య ప్రారంభించిన అమిత్‌షా

హిందీ బాషలో వైద్య విద్యను అందించే మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడు ప్రారంభించారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో హిందీ మెడికల్ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు. 
 
మెడికల్ బయోకెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియోలజీ సబ్జెక్ట్ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ మెడికల్‌ కళాశాల్లోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నటు ముఖ్యమంత్రి తెలిపారు. 
 
ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడు ఈరోజు స్వర్ణాక్షరాలతో ముద్రితమవుతుందని స్పష్టం చేశారు. 

ఇది దేశ విద్యా రంగానికి పునరుజ్జీవనం,  పునర్నిర్మాణ దినం అని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాథమిక , సాంకేతిక, వైద్య విద్య లో విద్యార్థుల మాతృభాషకు ప్రాధాన్యతను కల్పించడం ద్వారా కొత్త విద్యా విధానంలో ఎంతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా కొనియాడారు.

హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, గుజరాతీ, బెంగాలి మొదలైన ప్రాంతీయ భాషలలో వైద్య , ఇంజినీరింగ్ విద్య ను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం లోని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మొట్ట మొదటగా స్పందించిందని ఆ యన అభినందించారు. మాతృభాషలో ఆలోచనా ప్రక్రియ అత్యుత్తమంగా జరుగుతుందని, మాతృభాషలో మాట్లాడే పదాలు హృదయాన్ని తాకుతాయని విద్యార్థులకు చెప్పారు.

 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ, హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రం క్రెడిట్ మధ్యప్రదేశ్‌కే దక్కుతుందని తెలిపారు. ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా గ్వాలియర్‌లో నూతన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు అమిత్‌షా శంకుస్థాపన చేశారు.