స్వీడన్‌ శాస్త్రవేత్త పాబూకు మెడిసిన్ లో నోబెల్‌ బహుమతి

వైద్యశాస్త్రం (ఫిజియాలజీ)లో చేసిన విశేష కృషికి స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబూ ఈ ఏడాదికి నోబెల్‌ బహుమతి-2022కి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బహుమతి ప్రధాన సంస్థ సోమవారం స్వయంగా ప్రకటించింది. 
 
స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ సంస్థ ఈ బహుమతిని ప్రదానం చేస్తుంది. నోబెల్‌ గ్రహీతలకు పది లక్షల స్వీడిష్‌ క్రోనర్స్‌ నగదు అందుతుంది. మానవుల పరిణామక్రమం, అంతరించిపోయిన హ్యుమనిన్‌ జన్యువులకు సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. 
 
ఈ ఏడాది అందించే బహుమతుల్లో ఇదే మొదటిది. గతేడాది ఉష్ణగ్రాహకాలు, మానవుని స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటాపౌటియన్‌లకు ఈ బహుమతి దక్కింది. 1905లో క్షయపై పరిశోధనలు చేసిన రాబర్ట్‌ కోచ్‌, 1945లో పెన్సిలిన్‌ను కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌లు గతంలో ఇదే రంగంలో నోబెల్‌ బహుమతులను గెలుచుకున్నారు. 
 
స్వాంటే పాబో ప‌రిశోధ‌న‌లు పూర్తిగా నూత‌న శాస్త్రీయ క్ర‌మ‌శిక్ష‌ణ వేగాన్ని పెంచాయి. అంతరించిన మాన‌వ‌జాతులకు, ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచ మాన‌వాళికి మ‌ధ్య‌గ‌ల జ‌న్యుప‌ర‌మైన బేధాల‌ను ఆయ‌న త‌న ప‌రిశోధ‌న‌ల‌తో క‌నిపెట్టారు. 
 
వైద్య‌రంగ నోబెల్‌ను ప్ర‌క‌టించిన నోబెల్ ప్రైజ్ క‌మిటీ.. 4న ఫిజిక్స్ నోబెల్‌ను, 5న కెమిస్ట్రీ నోబెల్‌ను, 6న సాహిత్య నోబెల్‌ను, 7న నోబెల్ శాంతి బ‌హుమ‌తిని, 10న ఎక‌నామిక్స్ నోబెల్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ది. శాస్త్రవిజ్ఞాన, సాహిత్య,  రంగంతో పాటు ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి  అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే  నోబెల్‌ బహుమతిని  1901 నుండి నోబెల్ సంస్థ   ప్రదానం  చేస్తోంది.