ఇదీ మా రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా?

‘75 సంవత్సరాల తెలుగు వారి పరిస్థితి..  ఏం సాధించాం..? ప్రత్యేకించి ఆంధ్రులకు ఈ రోజు ఇదీ మా రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా?” అంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని తెలుగువారి ప్రగతిపై కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ముద్రించిన ‘అమృతభారతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దానికి కారణం కొందరికి ముందు చూపు తక్కువ ఉండడం కావచ్చు.. కొందరి హ్రస్వ దృష్టి కారణం కావచ్చు అని చెప్పారు.
 
తన చిన్నమ్మాయి ఢిల్లీలో ఇంద్రప్రస్థ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంటోందని చెబుతూ `మీ రాష్ట్రానికి రాజధాని ఏదని’ తనను ఆటపట్టిస్తూ ఉంటారని తెలిపారు. మన పిల్లలు కూడా తలవంచుకునే పరిస్థితిలో మన తెలుగుజాతి ఉందని విచారం వ్యక్తం చేశారు. బయటివారి దగ్గర అవమానం పొందే పరిస్థితిలో మనం ఉన్నామని తెలిపారు.
 
‘తెలుగు వారికి ఐక్యత లేదు. ప్రతి దానికీ కులం, రాజకీయం, స్వార్థం.. ఇటువంటి అవలక్షణాలు మార్చవలసిన బాధ్యత, అవకాశం రచయితలకే ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో నేతల పాత్ర ఎంతో రచయితల పాత్రా అంతే ఉందని గుర్తు చేశారు. అనేకానేక సామాజిక అంశాలపై రచయితలు రచనలు చేసి మార్పు రావడానికి కారణమయ్యారని తెలిపారు.
 
 ‘దురదృష్టవశాత్తూ ప్రస్తుతం అటువంటి మేధావుల్లో కూడా ఆలోచనా విధానంలో లోపం ఉంది. అది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు. సమాజం దేశం పట్ల బాధ్యతగా ఉండాలి. హక్కులపై మాట్లాడడం కాదు.. బాధ్యతలను కూడా గుర్తించాలి. రచనల ద్వారా చైతన్యపరిచి తెలుగుజాతి ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నా’ అని సూచించారు.
 
ఎటువంటి ఒత్తిళ్లకూ లొంగకుండా రచయితలు, మేధావులు రచనలు చేయాలని, రచనలను దుర్మార్గులైన పాలకుల కోసం వినియోగించకుండా తెలుగు జాతి, సమాజ అభివృద్ధికి వినియోగించాలని అభిలాషను వ్యక్తం చేశారు. మనవారిలో కష్టపడేతత్వం, సేవాభావం ఉన్నప్పటికీ కొత్తగా వచ్చిన అవలక్షణాల కారణంగా నలుగురిలోనూ నవ్వులపాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు.