మాతృభాషలో విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు

మాతృభాషలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సూచించారు. సైన్స్, సాహిత్యం, సాంఘిక శాస్త్రాలను మాతృభాషలో బోధిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆమె తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ తన గ్రామంలో స్కూలు చదువు ముగించుకుని కాలేజ్‌కు వెళ్లిన తొలి అమ్మాయిని తనే అని గుర్తు చేశారు.

ఈ క్రమంలో ఉపాధ్యాయులు అందించిన తోడ్పాటును ఆమె గుర్తు చేసుకున్నారు. మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తించి విద్యార్థులకు బోధిస్తే సైన్స్ తదితర క్లిష్టమైన సబ్జెక్టుల్లోనూ వారి ప్రతిభ మెరుగవుతుందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచ దేశాల విద్యావిధానంతో పోలిస్తే భారతీయ స్కూలు విద్యావ్యవస్థ ఎంతో పెద్దదిగా గుర్తింపు పొందిందని ఆమె వివరించారు. 

ఈ సందర్భంగా ఎంపికైన 46 మంది ఉపాధ్యాయులకు 2022 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు. పాఠశాల విద్యాభివృద్ధికి వారు చేసిన ఎనలేని కృషిని రాష్ట్రపతి ద్రౌపది ప్రశంసించారు. కాగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

పారదర్శకంగా మూడంచెల విధానంలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతల్లో తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన ముగ్గురేసి ఉపాధ్యాయులు ఉన్నారు. తెలంగాణ నుంచి కె రామయ్య, టిఎన్ శ్రీధర్, సునీతారావులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులుమీదుగా పురస్కారాలు అందుకున్నారు. 

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యాభివృద్ధికి విశేషసేవలతోపాటు విద్యార్థుల ఉన్నతికి చేసిన ఎనలేని కృషికి గుర్తింపుగా ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తున్నామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

 స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా

ఉపాధ్యాయ దినోత్సవాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా” పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 45 మందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ “ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా” పేరిట ఎంపిక చేసే 14,500 పాఠశాలల్లో నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. కొత్త టెక్నాలజీ, స్మార్ట్ క్లాస్‌రూంలు ఈ పాఠశాలల్లో ఉంటాయని చెప్పారు. ఈ పాఠశాలల ద్వారా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులకు మేలు జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  

దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి కూడా ప్రధాని ప్రస్తావిస్తూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన వేళ భారత్ సాధించిన ఘనత ఇటీవలే బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడం గా పేర్కొన్నారు.