
నిఘా కోసం ఇజ్రాయెలీ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ స్పైవేర్ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను అనధికారికంగా ఉపయోగించారనే ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీ 29 ఫోన్‌లను పరిశీలించగా వాటిలో 5 ఫోన్లలో కొన్ని మాల్‌వేర్‌లు ఉన్నట్లు తేలిందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వెల్లడించింది.
”5 ఫోన్‌లలో వారు కొన్ని మాల్వేర్‌లను కనుగొన్నారు, కానీ దానర్థం పెగాసస్ మాల్వేర్ అని కాదు” అని ముగ్గురు సభ్యుల సాంకేతిక కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కు నాయకత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి. రమణ తెలిపారు.
కమిటీకి ప్రభుత్వం సహకరించలేదని, ప్యానెల్ ప్రొసీడింగ్స్‌లో కూడా ఎస్సీ ముందు తీసుకున్న వైఖరినే అవలంబించిందని సిజెఐ రమణ తెలిపారు. సాంకేతిక కమిటీ నివేదికతో పాటు, పర్యవేక్షక న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఆర్‌వి రవీంద్రన్ నివేదికను పరిశీలించిన న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం జస్టిస్ రవీంద్రన్ నివేదికను తన వెబ్‌పేజీలో అప్‌లోడ్ చేస్తామని తెలిపింది.
ఈ కమిటీ సమర్పించిన నివేదిక మూడు భాగాల్లో ఉందని నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ ఫోన్లను సమర్పించినవారు నివేదికను బహిరంగంగా వెల్లడించవద్దని కోరినట్లు తెలిపింది. ఈ నివేదికలో కొంత భాగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంపై పరిశీలిస్తామని తెలిపింది.
ఈ నివేదికలో వ్యక్తిగత సమాచారం ఉండవచ్చునని, దీనిని రహస్యంగా ఉంచాలని కమిటీ చెప్పినట్లు తెలిపింది. ఈ నివేదికలో రెండు భాగాలను టెక్నికల్ కమిటీ ఇచ్చిందని, ఒక భాగాన్ని జస్టిస్ రవీంద్రన్ ఇచ్చారని పేర్కొంది. జస్టిస్ రవీంద్రన్ ఇచ్చిన భాగాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురిస్తామని పేర్కొంది.
మొదటి రెండు భాగాల నకలును తమకు ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, ఈ డిమాండ్‌ను పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు. నివేదికను పూర్తిగా పరిశీలించకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమన్నారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా, కేంద్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ “నిస్సందేహంగా” సంక్షిప్త అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉందని, అందువల్ల వివరాలను బహిరంగ అఫిడవిట్‌లో ఉంచడం, దానిని బహిరంగ చర్చనీయాంశంగా చేయడం ఇష్టం లేదని పేర్కొంది. సమస్యను పరిశీలించే నిపుణుల కమిటీకి వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది.
కమిటీ ఏర్పాటుకు అనుమతించాలని కోర్టును కోరింది. గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ నవీన్ కుమార్ చౌదరితో కూడిన సాంకేతిక కమిటీని బెంచ్ ఏర్పాటు చేసింది; అందులో డాక్టర్ ప్రబాహరన్ పి, కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో ప్రొఫెసర్; డాక్టర్ అశ్విన్ అనిల్ గుమాస్టే, బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్ చైర్ అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?