బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను మంగళవారం ఉదయం పాదయాత్ర శిబిరం వద్ద అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు, తర్వాత అసలు పాదయాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సంజయ్ తో పాటు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు.
జనగామలో కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్రను తక్షణమే నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులు ఆరోపించారు. ధర్మ దీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు.
“జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలి. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే పాతయాత్రను నిలిపివేస్తూ నోటీసులిచ్చామన్న పోలీసులు పాదయాత్రను నిలిపివేయకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఎట్టి పరిస్థితులలో యాత్రను ఆపివేసి ప్రసక్తి లేదని బిజెపి నేతలు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని చెబుతూ, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రగతిభవన్ కుట్రలో భాగంగానే సంజయ్‌ని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ ప్రధాని మోదీ ఏరోజూ కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు.
సంజయ్ అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. రోజు రోజుకు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ పాదయాత్రను అడ్డుకున్నారని విమర్శించారు.
సంజయ్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. సంజయ్ యాత్రతో టిఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయని అంటూ అనుమతి తీసుకొని యాత్ర చేస్తుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మండిపడుతూ బిజెపిని చూస్తే టిఆర్ఎస్ లో వణుకు మొదలవుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తున్న కాషాయదళం ఉనికిని తట్టుకోలేక రెండు రోజులుగా బీజేపీ కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేయించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు.

More Stories
ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు.. సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురు
భారతీయ నేలల్లో తీవ్రంగా లోపించిన పోషకాలు
మావోయిస్టు తెలంగాణ నేత బండి ప్రకాష్ లొంగుబాటు