సిసోడియా మద్యం కుంభకోణంలో `తెలుగు’ నేతలు!

సిసోడియా మద్యం కుంభకోణంలో `తెలుగు’ నేతలు!
సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సంబంధించిన కేసులో సీబీఐ శుక్రవారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా, ఎక్సైజ్ శాఖల మంత్రి మనీశ్ సిసోడియా అధికారిక నివాసంలో సోదాలు జరపడంతో ఈ కుంభకోణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మద్యం సరఫరాలో ఓ వైసిపి ఎంపీ ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు.  కుంభకోణంలో కొందరు టీఆర్‌ ఎస్‌ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉదయం 8 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 8 వరకూ సుదీర్ఘంగా కొనసాగాయి. సెంట్రల్ ఢిల్లీలోని సిసోడియా అధికారిక నివాసంతో పాటు 7 రాష్ట్రాల్లోని 20 చోట్ల కూడా ఏకకాలంలో సీబీఐ దాడులు జరిగాయి. గత ఏడాది నవంబర్​లో తెచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులు, ఇతరుల ఇండ్లలో కూడా తనిఖీలు కొనసాగాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు  సిఫారసు చేయగా, కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ ఈ నెల 17న కేసును నమోదు చేసింది. మొత్తం 16 మందిపై నేరపూరిత కుట్ర, రికార్డుల మార్పు, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
శుక్రవారంనాటి తనిఖీల్లో ఓ ప్రభుత్వ అధికారి ఇంటి నుంచి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన రహస్య ఫైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకుందని, సోదాలు కొనసాగుతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.   ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ మొత్తం 16 నిందితుల పేర్లను నమోదు చేసింది. సిసోడియాను మొదటి నిందితుడిగా చేర్చింది.
ఆ తర్వాత అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్​ల పేర్లను చేర్చింది. వీరితో పాటు సిసోడియా సన్నిహితులు, వ్యాపారవేత్తలు 9 మందిని, 2 కంపెనీలను నిందితులుగా చేర్చింది.
అలాగే 16వనిందితులు​గా ప్రైవేట్ వ్యక్తులను పేర్కొంది. టెండర్ల తర్వాత లైసెన్స్​లు పొందినవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే సిసోడియా, ఇతర అధికారులు ఎక్సైజ్ పాలసీని రూపొందించారని, దీనిపై కాంపీటెంట్ అథారిటీ ఆమోదం తీసుకోలేదని సీబీఐ ఆరోపించింది.    ఎక్సైజ్ పాలసీ కేసులో పేర్కొన్న అక్రమ లావాదేవీలపై ఈడీ​ కూడా దృష్టిసారించనున్నట్లు  అధికారిక వర్గాలు తెలిపాయి.
సీబీఐ వివరాల ప్రకారం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021–22 రూపకల్పన, అమలులో లిక్కర్ కంపెనీలు, మధ్యవర్తులు జోక్యం చేసుకున్నారు. సిసోడియాకు సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండేలు లిక్కర్ లైసెన్స్​లు పొందిన బిజినెస్​మెన్ నుంచి కమీషన్ కలెక్ట్ చేసి, ప్రభుత్వ అధికారులకు బదిలీ చేశారు.
ఇండో స్పిరిట్స్ ఓనర్ సమీర్ మహేంద్రు రూ.కోటి మొత్తాన్ని దినేశ్ ఆధ్వర్యంలోని రాధా ఇండస్ట్రీస్ కంపెనీ అకౌంట్​కు బదిలీచేశారు. అర్జున్ పాండేకు మరో రూ 2 నుంచి రూ 4 కోట్లు పంపారు. ఎక్సైజ్ పాలసీ తయారీ, అమలులో అక్రమాలు జరిగాయి. ఇందులో విజయ్ నాయర్, మనోజ్ రాయ్, అమన్ దీప్ ధాల్, సమీర్ మహేంద్రు కీలక పాత్ర పోషించారు. పాలసీ వల్లే సన్నీ మార్వాకు చెందిన మహదేవ్ లిక్కర్స్​కు ఎల్-1 లైసెన్స్ దక్కింది.
సన్నీ మార్వా ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులకు లంచాలు ఇచ్చారు. ఈ పాలసీలో అక్రమాలపై తొలుత ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది జులై 30న పాలసీని ఉపసంహరించు కున్నారు. తాజాగా ఎల్జీ సిఫారసుతో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది.   
ఈ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధం ఉన్నదని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ స్వయంగా ఆరోపించడం ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. త్వరలో వారి పేర్లు బైటకు రాగలవని చెప్పారు. తెలంగాణ నేతలు బుక్‌ చేసిన హోటళ్లకు మనీష్‌ సిసోడియా వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వీరిలో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.
గత మేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కలుసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు తెలంగాణ నేతలు ఉన్నారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో 16 మంది పేర్లతో పాటు గుర్తు తెలియని అనేక మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లోనూ సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్‌ కోకాపేటతో పాటు బెంగళూరులో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. అరుణ్‌ రామచంద్ర పిళ్లై బెంగళూరు కేంద్రంగా స్పిరిట్, డిస్టిలరీస్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనపైనా ఆరోపణలున్నాయి.