నారాయణ ప్రిన్సిపాల్ ఛాంబర్ లో విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఫీజుల పేరిట కార్పొరేట్‌ కళాశాలలు సాగిస్తున్న దోపిడీకి అద్దం పడుతుంది.  ప్రిన్సిపల్ రూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపల్ తో పాటు ఏఓకు గాయాలలయ్యాయి.
 
తీవ్రంగా గాయపడిన వారిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని తొలుత సికింద్రాబాద్ యశోదా హస్పిటల్ కు ఆ తర్వాత డీఆర్డీవో అపోలో హాస్పిటల్ కు తరలించారు. రామంతపూర్ కు చెందిన విద్యార్థి సాయి నారాయణ అంబర్పేట నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండటంతో టీసీ కోసం కాలేజీ కి వెళ్ళాడు. ఫీజు బాకీ ఉండడంతో కాలేజీ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు.
దీంతో ఈరోజు స్టూడెంట్ యూనియన్ లీడర్లతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లారు. టీసీ విషయంలో ప్రిన్సిపల్ ఆశోక్ రెడ్డికి విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని భయపెట్టే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్, విద్యార్థి వెంకటాచారితో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డితో పాటు ఏఓకు గాయాలయ్యాయి. అయితే స్టూడెంట్ యూనియన్ లీడర్ స్వయంగా నిప్పు పెట్టుకున్నాడా లేక గదిలో దేవుడి ముందు వెలిగించిన దీపం అంటుకుని మంటలు చెలరేగాయా అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ ఆవరణతో పాటు ప్రిన్సిపల్ రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సందీప్ తో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ఆత్మహత్యాయత్నం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి  ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 
ఈ సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి కార్పొరేట్‌ కళాశాలల్లో వాటాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కార్పొరేట్‌ కాలేజీలను తరిమికొట్టాలని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో సీఎం కుటుంబ సభ్యులకు వాటాలు ఉండడంతో ఫీజు వేధింపులతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.