ఫార్మా కంపెనీల కోసం మా భూములు లాక్కుంటారా!

ఫార్మా కంపెనీల కోసం మా భూములు లాక్కుంటారా!
ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని నల్లగొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన బాధితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు వాపోయారు. తమకు జీవనాధారం ఆ భూములేనని, అవి లేకపోతే తమకు బతుకే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఆ గ్రామానికి చెందిన పలువురు బాధితులు బుధవారం గుండ్రాంపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.418, 415,396,348, 385 సర్వే నెంబర్లకు చెందిన దాదాపు 300 ఎకరాల అసైన్డు భూములున్నాయని, 150 కుటుంబాలు దశాబ్దాల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
 
అయినప్పటికీ ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆ భూములను స్వాధీనపర్చుకునేందుకు యత్నిస్తోందని, అందుకోసం ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా తమకు పంపిందని తెలిపారు. 
తమ ప్రాంతంలో ఇప్పటికే 18 ఫార్మా కంపెనీలున్నాయని.. అవి వెదజల్లే కాలుష్యంతో అల్లాడిపోతున్నామని వాపోయారు.
అయినప్పటికీ మళ్లీ టీఆర్ఎస్ నేత ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీ కోసం ఆ భూములను లాక్కోవాలని యత్నిస్తున్నారని, మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు.  సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, అందుకోసం అవసరమైన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
బిసిలను అణచివేస్తున్న  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 

కాగా, జనాభాలో 50 శాతానికి పైగా వున్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అణిచివేస్తుందని సంజయ్ ధ్వజమెత్తారు. ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే బడ్జెట్ లో బిసి సంక్షేమం కోసం  కేటాయిస్తున్న నామమాత్రపు నిధులలో 10 శాతం కూడా ఖర్చుపెట్టడం లేదని విమర్శించారు.
బీసీసబ్‌ప్లాన్‌ తెస్తామని 2017 బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ ప్రకటించిన ఇప్పటివరకు అతీగతీ లేదని గుర్తు చేశారు. 2017 లో ఏర్పాటు ఎంబీసీ కార్పోరేషన్‌కు గత నాలుగు బడ్జెట్‌లలో రూ  3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఖర్చు చేసింది రూ.10 కోట్లకు మించిలేదని తెలిపారు.
 
ఎంబీసీ లోన్ల కోసం 13,369 మంది ధరఖాస్తు చేసుకుంటే 1,419 మంది మాత్రమే ఋణాలు పొందారని చెప్పారు. ఎనిమిదేండ్లలో 5.70 లక్షలమంది బీసీలు స్వయం ఉపాధి లోన్లకు ధరఖాస్తు చేసుకుంటే కేవలం 50 వేల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారని వివరించారు.
నాయీ బ్రాహ్మణులకు ఎనిమిదేండ్లలో బడ్జెట్‌ రూ.660 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది రూ 60 కోట్లని,  గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ పథకం మూలపడి మూడేండ్లయ్యిందని,  కళ్లు గీత కార్మికుల కోసం తీసుకొచ్చిన 560 జీవో అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు.