కీలక కార్గిల్ పర్వత శిఖరానికి కొత్త పేరు

ఆపరేషన్ విజయ్ యుద్ధ వీరుల స్మారకార్థం కార్గిల్‌లోని కీలకమైన శిఖరానికి గన్ హిల్  అని పేరు పెట్టారు. 1999లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ పై విజయం సాధించడానికి గన్నర్స్ నిర్వహించిన ముఖ్యమైన పాత్రకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
శత్రు దేశమైన పాకిస్థాన్ సేనలు కార్గిల్ సెక్టర్‌లో ఆక్రమించుకున్న అత్యంత ఎత్తయిన శిఖరాల్లో పాయింట్ 5140 ఒకటి. దీనిని ‘పరమవీర చక్ర’ కెప్టెన్ విక్రమ్ బాత్రా నేతృత్వంలోని యోధుల బృందం 1999 జూన్ 20న తిరిగి స్వాధీనం చేసుకుంది. విక్రమ్ బాత్రాను కార్గిల్ హీరోగా గౌరవించుకుంటున్నాం. కార్గిల్ యుద్ధానికి ‘ఆపరేషన్ విజయ్’  అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, భారత రక్షణ దళాల విజయాన్ని స్మరించుకునేందుకు, ‘ఆపరేషన్ విజయ్’లో గన్నర్స్ ఆత్మ బలిదానాలకు నివాళులర్పించేందుకు, కార్గిల్ సెక్టర్, ద్రాస్‌లోని పాయింట్ 5140కు ‘గన్ హిల్’ అని పేరు పెట్టినట్లు తెలిపింది.
పాయింట్ 5140ను స్వాధీనం చేసుకోవడం వల్ల ఈ యుద్ధం త్వరగా పూర్తయినట్లు తెలిపింది. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసిందని భారత సైన్యం ప్రకటించింది. ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని తెలిపింది.