ఓటర్‌ కార్డుకు ఆధార్‌ను లింక్‌ చేసుకోండి

ఓటర్‌ కార్డుకు ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కోరారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందని తెలిపారు. 
 
ఆగస్టు 1వ తేది నుంచి నూతన మార్గదర్శకాలు అమలు కానున్నాయని వెల్లడించారు. ఇప్పటికే నమోదైన ఓటర్లు 2023 ఏప్రిల్‌ నాటికి ఆధార్‌ నెంబర్‌ తెలపాలని పేర్కొన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛంధమని, ఆధార్‌ నెంబర్‌ను సమర్పించని వారి ఓటర్ల జాబితాను తొలగించబోమని తెలిపారు. 
 
ఆధార్‌ నెంబర్‌ కోసం నూతనంగా ఫారం 6బి ప్రవేశపెట్టామని తెలిపారు. ఓటర్ల నుంచి ఆధార్‌ నెంబర్‌ సేకరించడానికి బూత్‌ లెవల్‌ అధికారి ఇంటింటికి తిరుగుతారని, అదేవిధంగా ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని వెల్లడించారు. ఆధార్‌ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని వివరించారు. 
 
ఓటర్లు ఆధార్‌ నెంబర్‌ను అందించలేకపోతే ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలని తెలిపారు. ఆధార్‌ సంఖ్యను సేకరణ, నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జనబాహుళ్యంలోకి వెళ్లకూడదని వెల్లడించారు. 
 
సేకరించిన హార్డ్‌ కాపీలు, ఇఆర్‌ఓల ద్వారా డబుల్‌ లాక్‌తో సురక్షితమైన కస్టడీలో ఉంచబడతాయని తెలిపారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని పేర్కొన్నారు. ఒక నియోజకవర్గ నుంచి మరో నియోజక వర్గానికి ఓటరుగా మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని వివరించారు.
 
 జాబితాలో పేరు తొలగించేందుకు ఉపయోగించే ఫారం 7లో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం దీనిని వినియోగిస్తుండగా ఇప్పుడు విభిన్న అంశాలకు వినియోగించనున్నామని పేర్కొన్నారు. 
 
నియోజకవర్గ పరిధిలోనే కాక ఇతర నియోజక వర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించనున్నామని వివరించారు.