ఢిల్లీలో మరో మంకీపాక్స్‌ కేసు

ఢిల్లీలో మరో మంకీపాక్స్‌  కేసు
ఇప్పటికే కేరళలో మంకీపాక్స్‌  కేసులు నమోదయి ఆందోళన కలిగిస్తుండగా తాజాగా ఢిల్లీలో మరో మంకీపాక్స్‌  సోకినట్టు వైద్య శాఖ అధికారులు గుర్తించారు.    కేరళలో ఈ  వైరస్ సోకిన ముగ్గురు కూడా యుఎఇ నుండి వచ్చిన వారు కాగా, ఢిల్లీలో ఎటువంటి ప్రయాణం చేసిన  చరిత్ర లేకపోయినా వైరస్ సోకడం గమనార్హం. ఈ కేసుతో దేశంలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
ఈ 31 ఏళ్ల వ్యక్తి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో జరిగిన ఒక పార్టీకి వెళ్లి వచ్చినట్లు సమాచారం. వెస్ట్ ఢిల్లీకి చెందిన ఇతను మూడు రోజుల క్రితం మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు శాంపిల్స్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శనివారం నాడు పంపించారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షించిన అనంతరం అతనికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. 
 
ఇదిలా ఉండగా.. మంకీపాక్స్ లక్షణాలతో కూడిన ఇద్దరి, ముగ్గురి శాంపిల్స్ ప్రతి వారం ముంబైకి వస్తున్నాయని.. కానీ తాజాగా రోజుకు రెండు, మూడు శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు వస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.దేశవ్యాప్తంగా 16 ల్యాబొరేటరీలు మంకీపాక్స్ కేసులను నిర్ధారించే పనిలో ఉన్నాయి. వీటిలో రెండు కేరళలో ఉన్నాయి.
 
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఇవే లక్షణాలు మంకీపాక్స్‌ ఉన్న వారిలో ఉంటాయని తెలిపారు. మెడ భాగం, చంకలు, గజ్జల్లో బిళ్లలు కట్టడమనేది ఈ వ్యాధి ప్రత్యేకతని వెల్లడించారు. రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. 
 
మరోవంక, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 20 వేల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం మరో 20వేల పాజిటివ్‌ కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 5.3శాతం తగ్గినప్పటికీ గడిచిన 24గంటల్లో 2100 యాక్టివ్‌ కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య లక్షా 52వేలకు చేరింది. 
ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 4.38కోట్లు దాటింది. శనివారం 36 మంది మృతి చెందడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,26,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.