కరోనా వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె, ఊపిరితిత్తుల సమస్య

కరోనా వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె, ఊపిరితిత్తుల సమస్య

గత రెండున్నరేళ్లుగా మొత్తం ప్రపంచ ప్రజలను అల్లకల్లోలం కావిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేక ప్రాణాంతక వ్యక్తులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. 

గుండె పనితీరులో అసాధారణ మార్పులు, చిన్నపాటి పనికే ఎక్కువ అలసట, నీరసం , విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె నిమిషానికి 90సార్ల కంటే ఎక్కువగా కొట్టుకోవడం తదితర గుండె సంబంధిత అనారోగ్య లక్షణాలు తీవ్రమవుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అదేపనిగా దమ్ము రావడం, ఊపిరితిత్తుల పనితీరులోనూ లోపాలు ఎదురవుతున్నాయి.

 ఈ పరిస్థితుల్లో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సూచించిన మేరకు కరోనా నుంచి కోలుకున్న 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ తరచూ కార్డియో రెసిపరేటరీ ఫిట్‌నెస్‌ టెస్టు (సీపీఎక్స్‌) చేయించుకుని గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన తాజా సర్వే సూచిస్తోంది.

ఈ సర్వే ఫలితాలు ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ లాన్సెట్‌లోనూ ప్రచురితమైంది. కరోనా బారిన పడి కోలుకున్న వారిలో శారీరక శ్రమ తక్కువగా చేసేవారు, దూమ, మద్యపానం ఎక్కువగా చేసేవారు, నడుము చుట్టుకొలత అధికంగా ఉన్నవారు, బాడీమాస్‌ ఇండెక్స్‌ (ఎత్తుకు తగిన బరువు) అసమంగా ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారిని గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. 

వీరు కరోనా నుంచి కోలుకున్న కొంత కాలం తర్వాత ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది, మత్తుగా ఉండడం వంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో పలువురి ప్రాణాలు తీస్తున్న గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే  గుండె ఆరోగ్యాన్ని చిన్న చిన్న అబ్జర్వేషన్ల ద్వారా ఎవరికి వారు పరిశీలించుకోవాలని, తేడా ఉంటే వెంటనే కార్డియాలజీ వైద్యుడిని సంప్రదించాలని సర్వే సూచించింది. 

6 నిమిషాల నడక, ట్రేడ్‌ మిల్‌ టెస్టు, షటిల్‌ వాక్‌, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటోందా..? తదితర విధాలుగా ముప్పును ముందేగా పసిగట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.