
ఇటీవల ఈరోడ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి శివకుమార్‌కు విడాకులు ఇచ్చేందుకు కుటుంబ న్యాయస్థానం నిరాకరిస్తూ తీర్పు చెప్పడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని ఆయన కోరారు. విడిపోయిన సమయంలో తన తాళిని తొలగించినట్టు శివకుమార్ భార్య అంగీకరించింది. అయితే, తాను గొలుసును మాత్రమే తొలగించానని, మంగళసూత్రాన్ని మాత్రం ధరించానని ఆమె తెలిపింది. అందుకు కారణం కూడా ఉందని పేర్కొంది.
ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను ప్రస్తావిస్తూ తాళి కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆమె దానిని తొలగించినా వైవాహిక బంధంపై అది ఎలాంటి ప్రభావం చూపదని తెలిపారు. అయితే, ఆ వాదనను జస్టిస్ వీఎం వేలుమణి, ఎస్ సౌంథర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టేసింది.
వివాహ వేడుకల్లో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని, అది అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేసింది. హిందూ వివాహిత తన భర్త జీవిత కాలంలో ఏ సమయంలోనూ తాళిని తీసేందుకు సాహసించదని, కానీ ఆమె తన తాళిని తీసినట్టు స్వయంగా అంగీకరించిందని, దానిని బ్యాంక్ లాకర్‌లో పెట్టినట్టు పేర్కొందని ధర్మాసనం తెలిపింది.
మహిళ మెడలో తాళి పవిత్రమైన విషయమని, ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుందని కోర్టు పేర్కొంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగిస్తారని, కాబట్టి ఆమె చర్యను భర్తను మానసికంగా హింసించే చర్యగా చెప్పొచ్చని, ఇది అత్యున్నత స్థాయి మానసిక క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్న కోర్టు విడాకులు మంజూరు చేసింది.
2011 నుంచి పిటిషనర్, ఆయన భార్య వేర్వేరుగా నివసిస్తున్నారని, ఈ కాలంలో మళ్లీ తిరిగి ఒక్కటి కావాలనే ప్రయత్నం జరిగినట్టు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. భార్య తన చర్య ద్వారా భర్తకు మానసిక క్రూరత్వం కలిగించిన దృష్ట్యా పిటిషనర్, ప్రతివాది (భార్య) మధ్య వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
More Stories
జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!