గోధుమపిండి, రవ్వ ఎగుమతులపై ఆంక్షలు

గోధుమ ఎగుమతులపై ఇప్పటికే ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమపిండి, రవ్వ సహా వాటి ఉత్పత్తులపైనా అమలు చేయాలని నిర్ణయించింది. ఇకముందు గోధుమ పిండి, గోధుమ రవ్వ సహా వాటి ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే వివిధ శాఖల మంత్రులతో కూడిన కమిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు ఈనెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ అధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేలోపు, అంటే జులై 6 నుంచి 12వ తేదీలోగా జరిగే షిప్‌మెంట్‌, ఎగుమతులకు మినహాయింపు ఇచ్చారు. అయితే, ఈ షిప్‌మెంట్‌లు దిగుమతిదారుకు 12వ తేదీలోగా అందాల్సి ఉంటుంది. మైదాపిండి, సెమోలినా వంటి ఉత్పత్తులు ఇప్పుడు ఆంక్షల పరిథిలోకి వచ్చాయని అధికారులు తెలిపారు. గోధుమ ఎగుమతులపై మే 13న కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అయితే ఆ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఎగుమతిదార్లు కొత్త ఎత్తువేశారు. గోధుమపిండి, రవ్వగా మార్చి ఎగుమతి చేయడంతో దేశీయంగా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటి ఎగుమతిపైనా ఆంక్షలు విధించింది. గత ఏడాది ఏప్రిల్‌లో 26వేల టన్నుల గోధుమ పిండిని ఎగుమతి చేయగా ఈ ఏడాది అదే సమయంలో ఏకంగా 96 వేల టన్నులు ఎగుమతి చేయడం విశేషం.
అంటే 2022 ఆర్థిక సంవత్సరంలో గోధుమపిండి, గోధుమల ఎగుమతులకు దీటుగా పెరిగాయన్నమాట. ఈ సమయంలో 2.12 బిలియన్‌ డాలర్ల విలువైన 70 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి చేయగా 274 శాతం పెరుగుదల నమోదైంది. మేలో నిషేధం విధించకపోయి నట్టయితే దాదాపు 80 లక్షల టన్నుల నుంచి కోటి టన్నుల మేర ఎగుమతులు జరిగేవి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గోధుమపిండి, రవ్వ సహా గోధుమ ఉత్పత్తులపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎగుమతిదార్ల అంచనా ప్రకారం 40 లక్షల టన్నుల నుంచి 45 లక్షల టన్నుల మేర మాత్రమే ఎగుమతులు జరిగే అవకాశం ఉంది. గత వేసవిలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతో గోధుమ దిగుబడి బాగా తగ్గింది.
మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల డిమాండ్‌ బాగా పెరిగింది. ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ  సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకు కళ్లెం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా గోధుమపిండి, మైదా, రవ్వ వంటివి ఎగుమతి చేయడానికి అభ్యంతరాలు ఏవీ లేవని, అయితే మంత్రుల కమిటీ ముందస్తు అనుమతితోనే చేయాల్సి ఉంటుందని కేంద్రం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా గోధుమల ఎగుమతుల్లో కీలకమైన రష్యా, ఉక్రెయిన్‌ నుంచి యుద్ధం నేపథ్యంలో సరఫరాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయగా గోధుమలు, గోధుమపిండి సరఫరాలో ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త ఎగుమతిదార్లు రంగంలోకి వచ్చారు. ఫలితంగా ధరల్లో హెచ్చుతగ్గులు నమోదైనాయి. నాణ్యత లేని గోధుమపిండిని ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.
 గోధుమల ఎగుమతులను నియంత్రించిన నేపథ్యంలో వ్యాపారులు పిండిగా మార్చి ఎగుమతులు చేయడాన్ని గమనించామని, అందువల్ల దానిపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం ఆహారభద్రత విభాగం కార్యదర్శి సుధాంశు పాండే ప్రకటించారు.
గడచిన మూడునెలల్లో కనీసం 30 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు ఎగుమతయ్యాయి. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి గోధుమల సరఫరా నిలిచిపోవడంతో అనేక దేశాలు భారత్‌ను ఆశ్రయించాయి.  అయితే దేశీయ అవసరాలు, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ గోధుమల సరఫరా చేయాలని కోరిన దేశాలకు ప్రాధాన్యతల రీత్యా ఎగుమతులకు కేంద్రం అనుమతిస్తుంది.