ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధంపై సిఫార్స్

ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధంపై సిఫార్స్
ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  ఎన్నికల మొదటి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నిర్వహించడం, ప్రచారం చేయడంపై కొంత పరిమితి ఉండాలని స్పష్టం చేసింది.  
ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రాజీవ్ కుమార్ ఓటర్ ఐడిలతో ఆధార్‌ను లింక్ చేయడానికి నోటిఫికేషన్‌లు జారీ చేయాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరడంతో పాటు పలు ఎన్నికల సంస్కరణలపై సిఫార్సులను చేశారు. 
 

 అర్హులైన వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నాలుగు అర్హత తేదీలను అనుమతించడంతో పాటు, అభిప్రాయ సేకరణలను నిషేధించే కమిషన్ ఇదివరకు చేసిన ప్రతిపాదనలను ఆయన  పునరుద్ధరించారు. అలాగే ఒక అభ్యర్థి పోటీ చేసే సీట్లను కేవలం ఒక దానికి పరిమితం చేయాలని కూడా కమిషన్ కోరుతున్నది.

‘‘ఈసీ ఆరు కీలక ప్రతిపాదనలను న్యాయ మంత్రిత్వ శాఖకు పంపింది. ఓటరు ఐడీలకు ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు అర్హులైన వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నాలుగు కటాఫ్ తేదీల కోసం నిబంధనలను తెలియజేయాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించాము,” అని ఎన్నికల కమీషన్ అధికారి ఒకరు వెల్లడించారు.

డిసెంబరు 2021లో, ప్రతిపక్షాలు నిరసనగా వాకౌట్ చేయడంతో “ఎలక్టోరల్ రోల్ డేటాను ఆధార్ ఎకోసిస్టమ్‌తో లింక్ చేయడం” ద్వారా రాజ్యసభ ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021ని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. తగిన చర్చ లేకుండానే ప్రభుత్వం హడావుడిగా బిల్లును ఆమోదించిందని కొన్ని పార్టీలు ఆరోపించాయి.

రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అధికారాలను  కల్పించాలని కూడా ఎన్నికల కమీషన్ చాలాకాలంగా కోరుతున్నది. రాజకీయ పార్టీలు ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ. 20,000, అంతకు మించిన మొత్తాలలో తీసుకున్న వివరాలని వెల్లడించవలసి ఉంటుంది. అయితే ఈ కనిష్ట మొత్తాన్ని రూ 2,000కు తగ్గిస్తూ  24ఎ నిబంధనను  సవరించాలని కూడా కమీషన్ ప్రభుత్వాన్ని కోరింది.

గత నెలలో రాజకీయ పార్టీల గుర్తింపు నిబంధనలతో పలు సవరణలను కమీషన్ కోరుతూ వస్తున్నది. తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించడంతో విఫలం చెందినా,  పార్టీ పేర్లు, కేంద్ర కార్యాలయం,  ఆఫీస్ బేరర్లు, చిరునామాలలో ఏమైనా మార్పులు ఉంటె కమీషన్ కు తెలపడంతో విఫలమైన తగు చర్యలు తీసుకొనే అధికారం కల్పించాలని కమీషన్ కోరుతున్నది.


ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29ఎ ప్రకారం సంఘాలు,  సంస్థలను రాజకీయ పార్టీలుగా నమోదు చేసుకోవడానికి కమిషన్‌కు అధికారం ఇస్తుంది. అయితే, పార్టీల రిజిస్టర్‌ను రద్దు చేయడానికి ఎన్నికల కమీషన్ కు అధికారం ఇచ్చే రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదు.
“చాలా రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేసుకుంటాయి.  కానీ ఎన్నికల్లో పోటీ చేయవు. ఇలాంటి పార్టీలు కాగితాలపైనే ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలనే దృష్టితో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా తోసి పుచ్చలేము. రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేసే అధికారం ఉన్న కమిషన్‌కు తగిన కేసుల్లో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కూడా ఉండటం తార్కికంగా ఉంటుంది” అని ఎన్నికల కమీషన్  2016లో తన ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణల హ్యాండ్‌బుక్‌లో పేర్కొంది.

తన దీర్ఘ కాల డిమాండ్లలో మరొకటిని పునరుద్ధరిస్తూ,  అభ్యర్థి పోటీ చేయగల సీట్ల సంఖ్యను పరిమితం చేయడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 33(7)ని సవరించాలని కమిషన్ కేంద్రాన్ని  కోరింది. ఈ చట్టం ప్రస్తుతం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలలో లేదా ఉప ఎన్నికలు లేదా ద్వైవార్షిక ఎన్నికలలో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి అనుమతిస్తుంది. 2004లో కూడా కమీషన్ సెక్షన్ 33(7)కి సవరణను ప్రతిపాదించింది.