
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్కు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇస్తామంటుంటే ఆయన మాత్రం భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పెడతా మంటూ దేశమంతా తిరుగుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు కథనాలను ప్రస్తావిస్తూ జాతీయ స్థాయిలో కేసీఆర్కు స్థానం లేదని స్పష్టం చేశారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంబీసీల సదస్సులో లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ హయాం లో ఎంబీసీ వర్గాలు మోసపోయాయని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో జనాభాలో సింహభాగమైన బీసీ, ఎంబీసీ, సంచార జాతులు పూర్తిగా నిర్వీర్యానికి గురి చేశారని విమర్శించారు. కుల వృత్తుల ఫెడరేషన్స్ను, బీసి కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు.
సబ్సిడీ రుణాల ధరఖాస్తుల వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ కరోనా సమయంలో పూర్తిగా నష్టపోయిన కుల, చేతివృత్తిదారులకు కనీస ఆర్థిక సహాయం కూడా చేయలేదని గుర్తు చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని, ఎంబిసీల సంచార జాతుల అస్థిత్వాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంబీసీ కులాలకు మోదీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్రమంత్రివర్గంలో సముచిత భాగస్వామ్యం కల్పించడంతో పాటు 27 శాతం రిజర్వేషన్లును వర్గీకరించుటకు జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
కేంద్రీయ స్కూల్స్, నవోదయ స్కూల్స్ ప్రవేశాలలో బిసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించారని, పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని వివరించారు. ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం మోదీ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 54 శాతం ఉన్న ఓబీసీలకు కేసీఆర్ కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని, ఇదే కేసీఆర్ గొప్పగా చెప్పే సామాజిక న్యాయమని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణాలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని, నరేంద్ర మోదీ పాలనలో దళారి పాత్ర లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నగదు చేరుతుండటాన్ని కేసీఆర్ సహించలేక లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు