హిజాబ్‌ వివాదం కర్ణాటకలో క్రమేపీ తగ్గుముఖం

కర్ణాటకలో హిజాబ్‌ వివాదం క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముస్లిం నేతల విజ్ఞప్తుల ఫలితంగా కోస్తా ప్రాంతమైన దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని అనేక కళాశాలల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హిజాబ్‌ లేకుండా తరగతి గదులకు హాజరయ్యేందుకు ముస్లిం విద్యార్థినులు ముందుకొస్తున్నారు.
వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పీయూ కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా తొలిరోజు ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ వెల్లడించారు. హైకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
 హిజాబ్‌ను నిషేధిస్తూ ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని వీటిని ఉల్లంఘించిన వారికి కళాశాలల్లోకి ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలే ఈ వివాదాన్ని రాజకీయం చేయాలని చూశాయని, తమ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా పరిస్థితి శాంతించిందని పేర్కొన్నారు.
ముస్లిం విద్యార్థినుల విద్యాభ్యాసానికి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. నిజానికి ఉన్నత విద్యారంగంలో మైనారిటీలు రాణించేందుకు కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.  మరోవైపు హిజాబ్‌ వివాదం ప్రారంభమైన ఉడుపి ప్రభుత్వ కళాశాలలో ప్రస్తుత ఏడాది ముస్లిం విద్యార్థినుల అడ్మిషన్‌ల సంఖ్య మరింతగా పెరుగుతుండడం గమనార్హం. ఈ ఏడాదైనా చదువు సాపీగా సాగాలని తల్లిదండ్రులు కోరుతున్నారు