
జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో రక్షకులై భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే జూబ్లిహిల్స్ మైనర్ బాలిక కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే అసలు నిందితులెవ్వరో తేలుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ లో జంగల్ రాజ్ నడుస్తుందని, న్యాయ వ్యవస్థకు స్థానం లేదని, తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరని, శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడటంలో… పరిపాలనా నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
జూబ్లిహిల్స్ ఘటన లో కొందరిని రక్షించే ప్రయత్నం జరుగుతుందని పేర్కొంటూ తెలంగాణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత జరుగుతున్న స్పందించడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ పూర్తిగా కుటుంబ రాజకీయాల్లో మునిగి పోయారని, ప్రభుత్వం లో చలనం లేదని విమర్శించారు.
కెసిఆర్ ఆఫీస్ కి వెళ్ళకుండా ఫాంహౌజ్ కే పరిమితమైండని చెబుతూ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తో బీజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇగ హోమ్ మంత్రి ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అన్నింటిలో విఫలమైనా తన `నాయకత్వం’ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి సర్కారు ఖజానా నుండి రూ.109 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలిచ్చారని తరుణ్ చూజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా, జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసును పోలీసులు పూర్తిగా నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ గల్లంతు చేసిన తరువాతే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు. అత్యాచారం జరిగిన ఘటన రోజు నుండి కేసు నమోదు చేయడ చేయడంలో పోలీసులు కావాలనే జాప్యం చేశారని స్పష్టం చేశారు.
కేసును తప్పు దోవ పట్టించేందుకు… ఈ కేసులో హిందువు ఉన్నట్లు చిత్రీకరించేందుకు మొదటి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు చేశారన్నారని తెలిపారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్దారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేయడంతోపాటు నిందితుల జాబితాలో చివరన చేర్చారని చెప్పారు.
గత పక్షం రోజులుగా రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా పోలీసులు, ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటూ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? సీఎం ఉన్నారా? అని సంజయ్ ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ కేసులో పోలీసులు పరస్పర విరుద్దంగా మాట్లాడుతున్నారని చెబుతూ ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం లేదని డీసీపీ జోయల్ డెవిస్ చెబితే, నిన్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాత్రం ఎమ్మెల్యే కొడుకుపైనా కేసు నమోదు చేశామని చెప్పారని పేర్కొన్నారు.
ఈ కేసులో మెజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సినప్పటికీ సకాలంలో చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చి ఆదేశాల మేరకే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు కేసును నీరుగార్చారని సంజయ్ ఆరోపించారు. పైకి మాత్రం నిందితులకు 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేసీఆర్ కొడుకు గత పక్షం రోజులుగా నగరంలో అత్యాచారం సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటె ఏమంటారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? అని నిలదీశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు