ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్న పంజాబ్ ప్రభుత్వం 

ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్న పంజాబ్ ప్రభుత్వం 

ప్రముఖులకు భద్రత కల్పించే విషయమై పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం పొంతనలేని మాట్లాతూ మాట్లాడుతూ ఉండడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నదని ధ్వజమెత్తుతున్నాయి. 

వీఐపీ (అత్యంత ప్రముఖ వ్యక్తి)లకు భద్రతా సిబ్బందిని తొలగిస్తూ మార్చి 12న పంజాబ్ ప్రభుత్వం మొదటిసారి ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇటువంటి ఆదేశాలను ఇస్తూనే ఉంది. దీంతో చాలా మంది భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గత నెలలో ముఖ్యమంత్రి భగవత్ మాన్ మాట్లాడుతూ, కొద్ది మంది వీఐపీల కన్నా 2.75 కోట్ల మంది ప్రజలు తమకు చాలా ముఖ్యమని తెలిపారు. పోలీసుల చేత పోలీసింగ్ మాత్రమే చేయిస్తామని స్పష్టం చేశారు.

గాయకుడు సిద్ధూ మూసేవాలాకు కల్పించిన భద్రతను మే 26న రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అంతకుముందు నలుగురు పోలీసులు ఆయనకు భద్రత కల్పించేవారు. దీనిని ఇద్దరు పోలీసులకు కుదించారు. రాష్ట్రంలో మొత్తం 424 మంది వీఐపీలు ఉన్నారని ప్రభుత్వం చెప్పింది. మే 29న సిద్ధూ దారుణంగా హత్యకు గురయ్యారు.

మరోవైపు ఓ పిటిషన్ పై హైకోర్టు విచారణ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం గురువారం స్పందిస్తూ, వీఐపీలకు భద్రతను పునరుద్ధరిస్తామని, ఆపరేషన్ బ్లూస్టార్ యానివర్సరీ సందర్భంగా పోలీసులు అవసరమయ్యారని చెప్పింది.

దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తన తప్పును అంగీకరించిందని, తన వద్దనున్న హోం మంత్రిత్వ శాఖను వదిలిపెట్టాలని డిమాండ్ చేశాయి.

పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఓం ప్రకాశ్ సోనీ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రతను కుదించడాన్ని సవాల్ చేశారు. దీనిని విచారణకు చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.  ఓ వ్యక్తికిగల భద్రతా సంబంధమైన ముప్పును ఏ విధంగా అంచనా వేస్తారో చెప్పాలని ఆదేశించింది. వీఐపీలకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ప్రజా బాహుళ్యానికి తెలిసేవిధంగా ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం స్పందిస్తూ ఆపరేషన్ బ్లూస్టార్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలకు గుర్తుగా జూన్ 6న ఘల్లుఘర దినాన్ని నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత మళ్ళీ 424 మంది వీఐపీలకు భద్రతను ఈ నెల 7 నుంచి పునరుద్ధరిస్తామని చెప్పింది.

శాంతిభద్రతల అవసరాల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికపై మాత్రమే వీఐపీలకు భద్రతను ఉపసంహరిస్తున్నామని పేర్కొంది.  పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ, అంతకుముందు భద్రతను ఉపసంహరించిన వీఐపీలకు తిరిగి భద్రతను పునరుద్ధరించాలని నిర్ణయించడం తీవ్రమైన లోపాలను, నిర్లక్ష్యాన్ని అంగీకరించడమేనని చెప్పారు.

వీఐపీలకు భద్రతను ఎందుకు ఉపసంహరించారు? ఎందుకు పునరుద్ధరిస్తున్నారు? ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. దీనిని బట్టి ఎక్కడో ఏదో జరిగినట్లు అర్థమవుతోందన్నారు. మాన్ ప్రదర్శించిన ప్రజాకర్షక నాటకం వల్ల పంజాబ్ అత్యంత విలువైన సాంస్కృతిక ప్రముఖుడిని, భావి తరం నేతను  కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కు ఇటీవల రాజీనామా చేసి, బీజేపీలో చేరిన సునీల్ జక్కర్ ఇచ్చిన ట్వీట్ లో, ఎవరు అబద్ధం ఆడుతున్నారు భగవంత్ మాన్ గారూ? అని నిలదీశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్ధమాడుతోందా? పంజాబ్ ప్రభుత్వం అబద్ధమాడుతోందా? అని ప్రశ్నించారు.

వీఐపీ సంస్కృతికి తెరదించడం కోసం వారికి కల్పించిన భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసిందని గుర్తు చేశారు. కానీ ఆపరేషన్ బ్లూస్టార్ యానివర్సరీ కోసం భద్రతా సిబ్బంది తాత్కాలికంగా అవసరమని నేడు హైకోర్టుకు పంజాబ్ ప్రభుత్వం చెప్పిందని విస్మయం వ్యక్తం చేశారు.