ఆడాళ్ల‌ను కించపరిచేలా బాడీ స్ప్రే యాడ్స్‌.. కేంద్రం సీరియ‌స్

స్త్రీలపై ద్వేషపూరితంగా, అత్యాచారాలను ప్రోత్సహించేలా ఉన్న కొన్ని బాడీ స్ప్రే యాడ్స్​ ప్రసారంపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ రాసిన లేఖను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిగణనలోనికి తీసుకొని ఈ వ్యాపార ప్రకటనపై తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేసింది.

ఈ వివాదాస్పద యాడ్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అడ్వర్‌టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యాపార ప్రకటనలపై విచారణ జరుపుతామని కేంద్రం స్పష్టం చేసింది.

మాస్ మీడియాలో స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలను ప్రసారం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాసింది. ఈ యాడ్‌ ప్రమోట్ చేసిన కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు. యాడ్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో తొలగించాలని స్వాతి మలివాల్ ఆదేశాలు జారీ చేశారు.

పెర్ఫ్యూమ్ బ్రాండ్ లయెర్స్ షాట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో భగ్గమనడంతో ఈ తరహా ప్రకటనలపై వివాదం చెలరేగింది.  ఈ ప్రకటన ‘‘గ్యాంగ్ రేప్ సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని’’ శనివారం  మహిళా కమిషన్ పేర్కొంది.

ఈ ప్రకటనను తక్షణం నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో కోరారు. అత్యాచార సంస్కృతిని ప్రోత్సహించే ఇలాంటి మురికి ప్రకటనలు మళ్లీ ప్రసారం కాకుండా ఉండేలా కొన్ని తనిఖీలు, ప్రామాణికతను నిర్థారించడానికి బలమైన వ్యవస్థ ఉండేలా చూడాలని మలివాల్ కోరారు. అలాగే సదరు పెర్ఫ్యూమ్ బ్రాండ్‌పై భారీ జరిమానా విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

దీనితో ద్వందార్ధాల పైత్యాన్ని యాడ్స్‌లో జొప్పించి ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసుకున్న ఆ  కంపెనీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గుజరాత్‌కు చెందిన అడ్జవిస్ వెంచర్ లిమిటెడ్  కంపెనీ దేవుడొరంట్ ను విక్రయిస్తుంటుంది. లయెర్స్ షాట్   అనే పేరుతో మార్కెట్లో దొరికే ఈ కంపెనీ డియోడ్రెంట్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు తాజాగా రెండు యాడ్స్‌ను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానళ్లలో విడుదల చేసింది. ఈ రెండు యాడ్స్ పెను దుమారానికి తెరలేపాయి. సోషల్ మీడియాలో ఈ యాడ్స్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.